సీబీఐ వెనుక జగన్.. నేరం నాది కాదు..
posted on Mar 26, 2021 @ 10:49AM
తమపై నమోదైన సీబీఐ ఎఫ్‌ఆర్‌ఐపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వివరణ ఇచ్చారు. అభూతకల్పనలు, అవాస్తవాలతో సీబీఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిందన్నారు. సీబీఐ ఎఫ్‌ఐఆర్ వెనుక వైసీపీ నేతల ఒత్తిడి ఉందన్నారు రఘురామ కృష్ణరాజు. ఫిర్యాదు చేసిన ఎస్‌బీఐ మేనేజర్‌కు, సీఎంవో మధ్య.. ఫోన్ కాల్స్‌పై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పలు ఛార్జిషీట్‌లు దాఖలైన సీఎం జగన్.. విచారణకు హాజరుకాకపోయినా సీబీఐ పట్టించుకోవడం లేదన్నారు. ఎన్‌పీఎల్టీలో ఉన్న తన కంపెనీపై ఎఫ్‌ఐఆర్ దాఖలుకు ఆస్కారం లేదని తేల్చి చెప్పారు. నిధుల మళ్లింపు, దుర్వినియోగం ఆరోపణల్లో నిజం లేదని కుండబద్దలు కొట్టారు. నిజాలన్నీ నిలకడ మీద తెలుస్తాయని, సీబీఐ విచారణకు సహకరిస్తానన్నారు రఘురామ కృష్ణరాజు.
తనపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనందున రాజీనామా చేయాలని కొందరు ఎంపీలు అంటున్నారన్న రఘురామ.. వారు ఆ ప్రస్తావన తెచ్చినప్పుడల్లా.. నేనూ సీఎం జగన్‌రెడ్డిపై 33 చార్జిషీట్లు ఉన్నట్లు గుర్తు చేయాలా? అని ప్రశ్నించారు. సీబీఐ కోర్టుకు ప్రతి శుక్రవారం వెళ్లకుండా తప్పించుకుంటున్న సీఎం సంగతేంటి? అన్నారు. ప్రతివారం ఏవో పథకాల ప్రారంభం, శంకుస్థాపనల నెపంతో ఆయన సీబీఐ కోర్టుకు హాజరుకావడానికి భయపడుతున్నట్లు అనుకోవాలా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రఘురామ. జగన్‌పై ఉన్న చార్జిషీట్ల సంఖ్య కంటే ఒక్కటైనా అదనంగా.. అంటే నాపై 34 ఎఫ్‌ఐఆర్‌లు అక్రమంగా పెట్టేందుకు కుట్ర చేస్తున్నారు అని రఘురామరాజు మండిపడ్డారు.
వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చెందిన కంపెనీపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఆయన, ఆయన కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న ఇంద్‌భరత్ పవర్ జెన్‌కాం లిమిటెడ్ కంపెనీ తమను తీవ్రంగా మోసగించిందని, నకిలీ డాక్యుమెంట్లు సమర్పించిందని.. తమ నిధులను దాదాపు రూ.237.84 కోట్ల మేర స్వాహా చేసిందని ఆరోపిస్తూ బ్యాంకుల కన్సార్షియం తరఫున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్నై శాఖ డిప్యూటీ జనరల్ మేనేజర్ రవిచంద్రన్ చేసిన ఫిర్యాదును సీబీఐ పరిగణనలోకి తీసుకుంది. ఈ కంపెనీ ఎస్‌బీఐకి రూ.107.57 కోట్లు, యాక్సిస్ బ్యాంకుకు రూ.123.65 కోట్లు, సిండికేట్ బ్యాంకు రూ.46.05 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.13.95 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు రూ.6.62 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, ఇంకా యూకో బ్యాంకు, ఐఎల్‌ఎ్‌ఫఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి వివరాలు రావలసి ఉందని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.