చంద్రబాబు పై అలిగిన మోత్కుపల్లి
posted on Jan 10, 2013 6:28AM
తెలుగుదేశం తరపున తెలంగాణా వాదులను ముఖ్యంగా తమపై దాడి చేస్తున్న తెరాస మరియు తెలంగాణా జేయేసి నాయకుల మీద ఎదురుదాడిచేసే పార్టీ మిస్సైల్ అని చెప్పుకోబడే మోత్కుపల్లి నరసింహులు, కొద్దికాలం క్రితం తమపార్టీ తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి ఏర్పాటు చేసిన కీలకమయిన పోలిట్ బ్యూరో సమావేశానికి తనను ఆహ్వానించకపోవడంతో అలిగి, నిన్న మాదిరాపురంలో జరిగిన పార్టీ సమావేశానికి, పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన చంద్రబాబు 100 రోజుల పాదయాత్ర విజయోత్సవ సభకి గైర్హాజరు అయ్యేరు. చంద్రబాబు తన ప్రతినిదులను పంపి ఆయనని బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన రాలేదు. పార్టీకి అనేక సం.లుగా సేవలందిస్తూ తెలంగాణా విషయంలో పార్టీకి రక్షణ కవచంగా నిలుస్తున్న తనను, కీలక సమావేశానికి ఆహ్వానించకుండా చంద్రబాబు అవమానించారని మనస్తాపం చెందిన మోత్కుపల్లి, పత్రికలకెక్కి ఆ విషయాలను బయట పెట్టి పార్టీ పరువు తీయడం ఇష్టం లేకనే మౌనం వహిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు కూడా ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడి బుజ్జగించాలని భావిస్తున్నట్లు సమాచారం.