మంచువారి సపోర్ట్ వైకాపాకా లేక టిడిపికా?
posted on Apr 23, 2013 @ 5:26PM
చిరంజీవితో మోహన్ బాబుకి ఉన్న వైరం పాముకి ముంగీసకి ఉన్న ఆజన్మ వైరంవంటిది. దానికి ముఖ్య కారణం తెలుగు సినిమా రంగంలో వారిద్దరి మద్య భూమ్యాకాశమంత ఉన్న తేడానే! ఇద్దరూ స్వయంకృషితో పైకి వచ్చినప్పటికీ మోహన్ బాబు ‘కలెక్షన్ కింగ్’ అనిపించుకోగలిగారు కానీ, ‘మెగా స్టార్’ అనో లేక ‘లిజండ్’ అనో అనిపించుకోలేకపోయారు. ముక్యంగా చిరంజీవిని ‘లిజెండ్’ అని అందరు మెచ్చుకొన్నపుడు, వారిద్దరూ ఒకే వేదిక మీద ఉన్నపుడే మోహన్ బాబు స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్లుగా అభ్యంతరం చెప్పిన ఘనుడు. నిజం చెప్పాలంటే అప్పటి నుండే ఆయనలో ఆత్మన్యూనత కూడా మొదలయిందని చెప్పవచ్చును.
సాధారణంగా అటువంటి సమస్యతో బాధపడేవారు అందరి కంటే ఎక్కువగా వారే తమ శత్రువుని పదేపదే తలచుకొంటూ, ఏదో రకంగా వారి ప్రస్తావన తెస్తూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నిందించడం లేదా వారిని తక్కువ చేసి మాట్లాడటం చేస్తుంటారు. ప్రస్తుతం మోహన్ బాబు కూడా అదేవిధంగా మాట్లాడుతున్నారు.
మళ్ళీ రాజకీయాలలోకి వస్తానంటున్నమోహన్ బాబు “ఒక్క సినిమా హిట్టయిపోగానే నేనే ముఖ్యమంత్రిననుకొనే వాళ్లున్నారు,’ అని అన్న మాటలు చిరంజీవి చేసిన సూపర్ హిట్ సినిమా ‘టాగూర్’ గురించేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాలో ఆయన రాష్ట్రంలో అవినీతిని అవలీలగా రూపుమాపినట్లు చూపించినపుడు దానికి ప్రజలనుండి బ్రహ్మాండమయిన స్పందన వచ్చింది. అదే ఊపులో ఆయన ప్రజారాజ్యం స్థాపించడం, తనకున్న విపరీతమయిన జనాధరణతో అవలీలగా ముఖ్యమంత్రి అయిపోదామనే ఆయన ఆశపడటం, కానీ పార్టీని సరిగ్గా నియంత్రించుకోలేక ఎన్నికలలో చతికిలబడి అభాసు పాలవడం, తదనంతరం జరిగిన పరిణామాలను గమనించిన మోహన్ బాబు రాజకీయాలలోకి రావాలనే తన బలమయిన కోరికను బలవంతంగా అణచివేసుకొన్నపటికీ ఆశలు వదులుకాలేదని ఆయన తాజా ప్రకటన తెలియజేస్తోంది.
“పార్టీ పెట్టే దైర్యం, దానిని అమ్ముకొనే తెలివి తేటలు నాకు లేవని” మోహన్ బాబు వ్యంగంగా పలకడం ఎవరిని ఉద్దేశించి అన్నావో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవిని మనస్పూర్తిగా ద్వేషించే కొద్దిమందిలో మోహన్ బాబు కూడా ఒకరు. గనుక, చిరంజీవి కేంద్రమంత్రిగా వెలుగుతున్న కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనలో మరింత ఆత్మన్యూనత పెరుగుతుందే తప్ప తరగదు. కనుక ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం లేదు.
కొంత కాలం క్రితం ఆయన చంచల్ గూడా జైలుకి వెళ్లి జగన్ మోహన్ రెడ్డిని కలిసి రావడంతో, అందరూ ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఊహిస్తున్నారు. కానీ, నేడు కాకపోతే రేపయినాఆ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే కలిసే కలుస్తుందని, లేదా అదే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నందున మోహన్ బాబు ఆ పార్టీలో చేరే అవకాశాలు లేవని భావించవచ్చును. ఒకవేళ ఆ పార్టీలో జేరినా ఆ పార్టీ తిరిగి తనను చిరంజీవి ముందే నిలబెట్టే అవకాశం ఉంది గనుక ఆయన ఆ పార్టీలో చేరకపోవచ్చును. పైగా నిష్కర్షగా మాట్లాడే ఆయన ఆ పార్టీలోఎంతో కాలం ఇమడలేరు. అందువల్ల, ఆయన తెలుగు దేశం పార్టీలో జేరే అవకాశాలే ఎక్కువున్నాయి.
నందమూరి వంశంతో తనకున్న సత్సబందాలు, అభిమానం అందుకు ఒక కారణమయితే తన ప్రియ శత్రువు చిరంజీవిని రాజకీయంగా ఎదుర్కొని ఆయనను మనసారా ఎండగట్టాలంటే అందుకు అనువయిన పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీయే గనుక, ఆయన ఆ పార్టీలోకే తిరిగి ప్రవేశించవచ్చును.
అయితే, తనకి పదవులు, అధికారం మీద ఎంత మాత్రం ఆసక్తి లేదని కేవలం పార్టీ ప్రచారంలో పాల్గొనడంపైనే ఆసక్తి ఉందని ఆయన చెప్పడం వెనుక ఉన్న బలమయిన కారణం కనీసం జీవితంలో ఒక్కసారయినా మనసారా తన ప్రియ శత్రువుని చీల్చిచెండాడగలిగితే ఆయన అహం శాంతించవచ్చును. అందుకే ఆయన ఇప్పుడు రాజకీయాలలో ప్రవేశించడం, ప్రచారంలో పాల్గొనడం గురించి మాట్లాడుతున్నారిప్పుడు. ఆయనలో ఆ అహం శాంతించితే ఎన్నికల అనతరం మళ్ళీ రాజకీయాలకి దూరం వెళ్లిపోవచ్చును.