దేవుని పాదాల చెంతకు చేరిన వందేళ్ల అద్భుత కాలం!
posted on Dec 30, 2022 6:08AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మాతృవియోగం కలిగింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి, 100ఏళ్ల హీరాబెన్ మోదీ.. గుజరాత్ అహ్మదాబాద్ లోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
"ఒక అద్భుతమైన 100ఏళ్ల కాలం.. దేవుడి పాదాల వద్దకు చేరింది. అమ్మలో నిస్వార్థ కర్మయోగి, జీవితానికి కావాల్సిన విలువలను చూశాను. 100వ జన్మదినం నాడు నేను అమ్మని చూసినప్పుడు నాకు ఒక విషయం చెప్పింది. అది నేను ఎప్పటికి గుర్తుపెట్టుకుంటాను. ఇంటెలిజెన్స్ తో పని చేయ్యి, స్వచ్ఛతగా జీవించు అని చెప్పింది," అని మోదీ అన్నారు.
100ఏళ్ల హీరాబెన్ మోదీ.. అనారోగ్య సమస్యల కారణంగా బుధవారం అహ్మదాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఈ వార్త తెలుసుకున్న ప్రధాని.. ఢిల్లీ నుంచి వెంటనే అహ్మదాబాద్కు వెళ్లి ఆమెను పరామర్శించారు. వైద్యులతో ఆమె ఆరోగ్యం గురించి చర్చించారు. హీరాబెన్ మోదీ కోలుకుంటున్నారని, ఒకటి- రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్ఛ్ అవుతారని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆమె మరణవార్తను శుక్రవారం ఉదయం వెల్లడించారు మోదీ.
యూఎన్ మెహ్తా హార్ట్ హాస్పిటల్ వర్గాల ప్రకారం.. హీరాబెన్ మోదీ శుక్రవారం తెల్లవారుజామున 3:39 గంటలకు తుదిశ్వాస విడిచారు. ప్రధాని మోదీ సోదరుడు పంకజ్ మోదీతో కలిసి గాంధీనగర్లని రాయ్సన్ అనే గ్రామంలో నివాసముండేవారు హీరాబెన్ మోదీ.
హీరాబెన్ మోదీతో నరేంద్ర మోదీకి ప్రత్యేక అనుబంధం ఉంది. ఎప్పుడు గుజరాత్ వెళ్లినా.. తల్లితో గడుపుతారు ప్రధాని మోదీ. ముఖ్యంగా ఎన్నికల సమయంలో.. కచ్చితంగా ఆమె ఆశీర్వాదాలు తీసుకుని వెళతారు. పుట్టిన రోజు సందర్భంగానూ.. తల్లి వద్దకు వెళ్లి మిఠాయిలు తినిపించే వారు మోదీ.ఇక తల్లి మరణవార్త తెలుసుకున్న మోదీ.. గుజరాత్ బయలుదేరారు.ప్రధాని మోదీ తల్లి మరణం పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.