మోదీజీ ఇప్పటికైనా ప్రజారోగ్య వ్యవస్థను పట్టించుకోండి!
posted on Apr 16, 2020 @ 1:56PM
కోవిడ్-19 నివారణ, చికిత్సలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? లాకౌడౌన్ కొనసాగింపు మినహా కేంద్ర ప్రభుత్వం కరోనాను కట్టడి చేయటానికి అమలు చేస్తున్న నిర్దిష్ట వ్యూహం, చర్యలు ఏమీ లేవు! కరోనాపై సాగే పోరాటం కేవలం ప్రజలే బాధ్యతతో చేయాల్సిన పోరాటంగా పరిమితం చేయాలన్నది ప్రధానమంత్రి వ్యూహంగా కనిపిస్తోంది.
కేవలం లాక్‌డౌన్ ద్వారా మాత్రమే భారతదేశంలో కరోనా నియంత్రణ సాధించలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే హెచ్చరించింది. లాక్‌డౌన్ తాత్కాలిక వ్యూహంగా మాత్రమే ఉండాలని, ప్రధాన నియంత్రణ వ్యూహాలుగా ట్రెసింగ్, టెస్టింగ్ అండ్ ట్రీట్మెంట్ అంటే గుర్తించటం, రోగ నిర్ధారణ పరీక్షలు చేయటం, నిర్ధారణ అయిన వారిని క్వారంటాయిన్‌లో ఉంచి చికిత్స అందించడం ద్వారా మాత్రమే కోవిడ్-19ను పూర్తి స్థాయిలో అదుపు చేయగలుగుతామని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. దీనిగురించి ఎక్కడా పట్టించుకున్న దఖలాలు లేవు.
పదే పదే ప్రధాని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రజలదే అంటూ నొక్కివక్కాణించారు తప్ప ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసి కరోనాను కట్టడి చేయటానికి అనుసరించబోతున్న వ్యూహం, దాని అమలుకు కావలసిన విధానాలు, నిధులు గురించిన ప్రస్తావన ప్రధానమంత్రి ఎక్కడా చేయలేదు.
200 లాబోరేటరీలు కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలకు సిద్ధం చేస్తున్నామని ప్రధాన మంత్రి తన ప్రసంగంలో చెప్పారు. అయితే ఇందులో ప్రయివేటు లాబోరేటరీలు ఎన్ని, వాటిలో పరీక్షలకు అయ్యే ఫీజు పరిస్థితి ఏమిటన్న విషయంపై వివరణ ఇవ్వలేదు. ప్రజలందరికీ ఉచితంగా పరీక్షలు చేయాలని సూచించిన సుప్రీంకోర్టు మళ్లీ మనసు మార్చుకొని పేదలకు మాత్రమే అందించాలని ప్రయివేట్ లేబరేటరీలు తాము నిర్ధారించుకున్న ఫీజు వసూలు చేసుకోవచ్చని చెప్పింది.
వాస్తవానికి భారతదేశంలో మొదటి కోవిడ్-19 కేసు జనవరి 30న నమోదైంది. 13 మంది కోవిడ్-19 రోగ గ్రస్తులైన ఇటలీ పర్యాటకులు రాజస్థాన్‌లో పర్యటించారు. వారితో పాటు ప్రయాణం చేసిన డ్రైవర్‌కు కూడా కోవిడ్-19 సోకినట్టు నిర్ధారణ అయిందని ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మార్చి 4న పార్లమెంట్‌లో చెప్పారు.
అప్పటి నుంచి కొన్ని విమానాశ్రయాల్లో ప్రయాణీకుల శరీర ఉష్ణోగ్రతలు చెక్ చేసారే తప్ప ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన ప్రమాణాల మేరకు పరీక్షలు చేయలేదు. ప్రపంచ స్థాయిలో కమ్ముకొస్తున్న కరోనా ముప్పు నియంత్రణ బాధ్యత కూడా ప్రజలదే అని మోదీ ప్రభుత్వం బుకాయిస్తోంది.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత వివిధ సుంకాలపై వసూలు చేసిన సెస్ రెండున్నర లక్షల కోట్లు ఖర్చు కాకుండా మిగిలి ఉంది.
మరో 20లక్షల కోట్లు ఈ ఆరున్నరేండ్లలో పెట్రోలియం ఉత్పత్తులపై వసూలు చేసిన పన్నులున్నాయి.
కాంగ్రెస్ హయాంలో జరిగిన 2జీ స్పెక్త్రం కుంభకోణాన్ని సరి చేయటం ద్వారా కేంద్రానికి రెండు లక్షల కోట్లు ఆదా చేశామన్నారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల వాటాలు తనఖా పెట్టి గత ఒక్క ఏడాదిలోనే 35వేల కోట్లు నిధులు సమకూర్చుకుంది కేంద్రం.
అదనంగా ఆర్‌బీఐ బాండ్లు విదేశీ మార్కెట్‌లో జారీచేసి రెండు లక్షల కోట్లు సమీకరించేందుకు పథకం సిద్ధమైంది.
ఇన్ని నిధులున్నా కరోనా రకాసి నుండి 130కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడేందుకు నిధులు ఎందుకు సిద్ధం చేయలేక పోతోంది మోదీ ప్రభుత్వం.