విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం అయిపోయింది.. పేదల ఖాతాల్లోకి సొమ్ముపై మోడీ మరో హామీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ మరోసారి పేదల ఖాతాల్లోకి సొమ్ము అంటూ హామీ ఇచ్చారు. దీంతో గతంలో కూడా విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని దేశానికి రప్పించి పేదల ఖాతాల్లో జమ చేస్తానంటూ ఇచ్చిన హామీ గురించి జనం గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నికల ముందే పేదల ఖాతాలు, వాటిలోకి సొమ్ము జమ విషయం గుర్తుకు వస్తుందా అంటూ నిలదీస్తున్నారు.  

అవినీతి అధికారులు,నాయకులవద్ద పట్టు పడ్డ సంపద బీద ప్రజలకు పంచుతామని   మోడీ హామీ ఇవ్వడమ కాకుండా, ఆ విషయంపై ఇప్పటికే న్యాయసలహా తీసుకున్నామని చెప్పారు. ఇందుకోసం అవసరమైతే   చట్టం సవరణకు కూడా వెనుకాడబోమని అన్నారు.   

ఈడి స్వాధీనం చేసుకున్న సంపద రూ. 1.25 లక్షల కోట్లుగా చెప్పిన మోడీ.. ఆ సొమ్మును పేదల ఖాతాల్లో జమ చేయడానికి కసరత్తు చేఃస్తున్నామన్నారు.  2014 ఎన్నికల సమయంలో కూడా మోడీ తాము   అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశాల్లో మన వారు దాచిన నల్లధనాన్నిస్వదేశానికి  తీసుకువచ్చి పంచుతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. అయితే నల్లధనాన్ని పేదలకు పంచే పని మాత్రం చేయలేదు. అసలా హామీ ఇచ్చిన విషయాన్నే ఆయన ఎన్నడూ ప్రస్తావించలేదు.  అందుకు భిన్నంగా పెద్ద నోట్లు రద్దు నిర్ణయం తీసుకుని జనాలు అన్ని విధాలుగా ఇబ్బందులు పడేలా చేశారు.  ఇప్పుడు తాజాగా   దేశంలో  పట్టుబడ్డ నల్లధనం పంచేస్తానని మరోసారి హామీ ఇచ్చారు. ఈ ఒక్క హామీతో మోడీ మరోసారి ప్రజల విశ్వాసం పొందే అవకాశాలు ఉన్నాయని బీజేపీ గట్టిగా నమ్ముతోంది.

అయితే విశ్లేషకులు మాత్రం సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఇప్పటి వరకూ జరిగిన ఐదు విడతల ఎన్నికలలో ఇండియా కూటమి బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిందని విశ్లేషిస్తున్నారు.  ఇండియా కూటమితో విభేదించిన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఎన్నికల సరళిని గమనించి అవసరమైతే కాంగ్రెస్ నేతృత్వంలోని  ఇండియా కూటమికి  మద్దతు ఇస్తామని ప్రకటించడాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.   మొత్తం మీద పేదల ఖాతాలలో జప్తు చేసిన సొత్తు జమ చేస్తానంటూ మోడీ చేసిన ప్రకటన, ఇచ్చిన హామీ ఎన్నికల సందర్భంగా ప్రజలను ఆకర్షించేందుకు చేసిన ఉత్తుత్తి హామీగానే పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా విదేశాలలో మూలుగుతున్న నల్లధనాన్ని స్వదేశానికి రప్పించి పేదల ఖాతాల్లో జమ చేస్తానంటే చేసి విస్మరించిన వాగ్దానాన్ని చూపుతున్నారు. 

Teluguone gnews banner