ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సంతోష్ కు బిగ్ రిలీఫ్
posted on Nov 26, 2022 5:51AM
ఎమ్మెల్యేలకు కొనుగోలు బేరసారాల కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో తమ ముందు విచారణకు హాజరు కావాలని తెలంగాణ సిట్ నోటీసుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 5కి వాయిదా వేసింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ ను నిందితుల జాబితాలో చేర్చి సీఆర్‌పీసీ 41ఏ కింద సిట్ ఆయనకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని, నోటీసు రద్దు చేయాలని బీఎల్ సంతోష్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఈ మేరకు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రోహిత్ రెడ్డి చేసిన ఫిర్యాదులో బీఎల్ సంతోష్ పేరు లేదని, ఎఫ్ఐఆర్‌లో కూడా పేరు లేనప్పుడు ఆయన్ని నిందితుల జాబితాలో ఎలా చేరుస్తారని అభ్యంతరం లేవనెత్తారు. ఈ విషయాలను అన్నింటిని పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు బీఎల్ సంతోష్ కు ఊరట కలిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కాగా ఈ కేసులో బీఎల్ సంతోష్ ప్రమేయంపై ఆధారాలు ఉన్నాయని తెలంగాణ అడ్వకేట్ జనరల్ వాదించారు.ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసుకు సంబంధించి బీఎల్ సంతోష్, కేరళ ఎన్డీయే కన్వీనర్ తుషార్, డాక్టర్ జగ్గుస్వామి, న్యాయవాది శ్రీనివాస్ ను సిట్ నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే.