డ్రాగన్ దేశంలో మళ్లీ కరోనా విలయం
posted on Nov 26, 2022 5:31AM
కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తోందా? మరో సారి వైరస్ ముప్పు ముంచుకు రాబోతోందా? మళ్లీ లాక్ డౌన్ లో క్వారంటైన్ లూ తప్పవా? అంటే చైనా ఔననే అంటోంది. కరోనా వైరస్ పుట్టిన చైనాలో ఆ మహమ్మారి మరో సారి విజృంభిస్తోంది. డ్రాగన్ దేశంలో ఒకే రోజు 33వేల మందికి పైగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
ఒక్క సారిగా కరోనా కేసులు పెరిగిపోవడంతో చైనా బెంబేలెత్తిపోతోంది. గురువారం ఒక్కరోజే 32వేల 943 కేసులు నమోదయ్యాయి. వీటిలో 29వేల 840 కేసులు అసింప్టొమేటిక్, 3వేల 103 కేసులు సింప్టొమేటిక్ అని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించినా, కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా.. రికార్డు స్థాయిలో వేల సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవడం భయాందోళనకు గురి చేస్తోంది.
మళ్లీ ప్రబలుతున్న కరోనా మహమ్మారి.. చైనా ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీసింది. ఈ వ్యాప్తి వేగం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరో వేవ్ తప్పదా అన్న అనుమానాలకు తావిస్తోంది. ప్రపంచంలో చాలా దేశాలు మళ్లీ కరోనా జాగ్రత్తలు పాటించాలంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాయి.