పోలీసుల త్యాగాల స్ఫూర్తిగా రక్తదాన శిబిరం : ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

 

సమాజ రక్షణలో ప్రాణాలర్పించిన పోలీసు అమర వీరులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  ఘన నివాళులు అర్పించారు. పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కోవూరు పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని శాంతి భద్రతల రక్షణలో అశువులు బాసిన పోలీసుల త్యాగాలను కొనియాడారు.  

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  మాట్లాడుతూ ఒక యూనిట్ రక్తంతో ముగ్గురి ప్రాణాలను రక్షించగలమనే సత్యాన్ని మనందరం గుర్తుంచుకోవాలన్నారు. రక్తదానం చేసేందుకు కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ముందుకు వచ్చిన యువతను ఆమె అభినందించారు. పోలీసు అమర వీరుల సంస్మరణార్ధం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

 రక్తదానం చేస్తున్న ప్రతి రక్తదాత ఒక ప్రాణదాతగా ఆమె అభివర్ణించారు. రక్తదానం అనేది యాక్సిడెంట్, ప్రసూతి లాంటి సందర్భాలలో ఎక్కడో ఆసుపత్రిలో ప్రాణాపాయ పరిస్థితిలో వున్న వ్యక్తికి ప్రాణం పొసే మహత్తర కార్యమన్నారు. సేవా భావంతో రక్తదానం చేస్తున్న రక్తదాతలు మరెందరికో ప్రేరణ కావాలని  ప్రశాంతి రెడ్డి ఆకాంశించారు. 

ఈ కార్యక్రమంలో నెల్లూరు రూమర్ డిఎస్పి ఘట్టమనేని శ్రీనివాసరావు, కోవూరు, కొడవలూరు, బుచ్చిరెడ్డి పాళెం సర్కిల్ సి ఐ లు సుధాకర్ రెడ్డి, సురేంద్రబాబు, శ్రీనివాసులు రెడ్డితో పాటు కోవూరు నియోజకవర్గ పరిధిలోని 5 పోలీస్ స్టేషన్ల సిబ్బంది మరియి పెన్నాడెల్టా ఛైర్మెన్ జెట్టి రాజగోపాలరెడ్డి, కోవూరు మండల టిడిపి అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు ఇంతా మల్లారెడ్డి, జెట్టి మదన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం

  ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో సుప్రీంకోర్టు వారం రోజులపాటు ప్రభాకర్ రావును కస్టడీలోకి తీసుకొని విచారణ చేసేందుకు అనుమతించిన విషయం తెలిసిందే... ఈ మేరకు మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుపై వారం రోజులపాటు సాగిన కస్టోడియల్ విచారణ ఈరోజుతో ముగిసింది. ఈ మేరకు రేపు సుప్రీంకోర్టుకు పూర్తి స్థాయి నివేదికను సమర్పించేందుకు సిట్ అధికారులు సిద్ధమవు తున్నారు. అయితే అధికారులు ప్రభాకర్ రావు ను కస్టడీలోకి తీసుకుని విచారణ చేసిన సమయంలో ప్రభాకర్ రావు కీలక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని, నోరు మెదపలేదని అధికా రులు పేర్కొంటున్నారు.  ఫోన్ టాపింగ్ వ్యవహారానికి సంబంధించి అత్యంత కీలక అంశాలను ఆయన దాటవేస్తున్నారని సిట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు మరికొన్ని రోజుల పాటు కస్టోడియల్ విచారణకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును మరోసారి కోరే అవకాశ ముందని సమాచారం....ఈ కేసులో నిజాలు వెలుగులోకి రావాలంటే ప్రభాకర్ రావును ఇంకా కస్టడీలో ఉంచి విచారణ కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. సిట్ సమర్పించనున్న నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేయనుంది. ఆదేశాలు వచ్చే వరకు ప్రభాకర్ రావు పోలీసుల కస్టడీలోనే కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం రాజకీయంగా, పరిపాలనాపరంగా కీలకంగా మారనుంది.  

నాటు సారాను అరికట్టాలి కలెక్టర్లకు... సీఎం చంద్రబాబు సూచన

  అమరావతిలో రెండు రోజుల పాటు సాగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్  ముగిసింది. ముగింపు ఉపన్యాసంలో సీఎం  చంద్రబాబు నాయుడు రాష్ట్ర పునర్నిర్మాణం, ఆర్థిక స్థిరీకరణ, పీపీపీ విధానాలు, విద్యుత్ రంగం, పాలనలో సంస్కరణలపై విస్తృతంగా మాట్లాడారు. గత పాలనలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్‌ను తిరిగి తీసుకురాగలిగామని, రూ.21 లక్షల కోట్ల పెట్టుబడులకు రికార్డు స్థాయిలో ఒప్పందాలు కుదిరాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. విద్యుత్ రంగంపై మాట్లాడుతూ యూనిట్‌కు రూ.1.20 మేర కొనుగోలు ధర తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.  పీపీఏల రద్దుతో గతంలో విద్యుత్ వ్యవస్థ నాశనం అయ్యిందని, డిస్కంలు–ట్రాన్స్‌కోలపై రూ.1,25,633 కోట్ల భారం పడిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.11,320 కోట్ల మేర భారం తగ్గించామని, విద్యుత్ ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు. రుణ నిర్వహణను సమర్థంగా చేపట్టి, అధిక వడ్డీలతో తీసుకున్న అప్పులను రీషెడ్యూలింగ్ చేస్తున్నామని తెలిపారు. పీపీపీ వైద్య కళాశాలల అంశంపై సీఎం ఘాటుగా స్పందించారు. పీపీపీ విధానంలో అభివృద్ధి జరుగుతుందని, ఈ విధానంలో చేపట్టే ప్రాజెక్టులు ప్రభుత్వ ఆస్తులుగానే ఉంటాయని, నిబంధనలు ప్రభుత్వమే నిర్ణయిస్తుందని చెప్పారు. ప్రైవేటు సంస్థలు నిర్వాహకులుగా మాత్రమే ఉంటాయని, సీట్లు పెరుగుతాయే తప్ప ఫీజులు పెరగవని భరోసా ఇచ్చారు. 70 శాతం వరకు ఎన్టీఆర్ వైద్యసేవల కింద ఉచిత చికిత్స అందుతుందని, పీపీపీ మెడికల్ కాలేజీలు రెండేళ్లలోనే సిద్ధమవుతాయని అన్నారు. ఈ విషయంలో బెదిరింపులు చేయడం రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. పాలన, శాంతిభద్రతలపై మాట్లాడుతూ కలెక్టర్లు, ఎస్పీలు జిల్లాల్లో నేరాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. వ్యక్తుల ప్రతిష్టను దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో చేసే పోస్టులను సహించవద్దని స్పష్టం చేశారు. నేరాల దర్యాప్తులో వేగం పెంచాలని సూచించారు. పాలనలో డిజిటలీకరణపై సీఎం కీలక ప్రకటన చేశారు. జనవరి 15 నుంచి అన్ని శాఖల ఫైళ్లు, ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లో ఉండాలని, అప్పుడే ప్రజలు సంతృప్తి చెందుతారని అన్నారు.  ఇప్పటివరకు ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ద్వారా మంచి ఫలితాలు సాధించామని, ఇకపై ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్’ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. పరిశ్రమలకు ప్రోత్సాహం కోసం ఎస్క్రో ఖాతా విధానం తీసుకొచ్చినట్లు తెలిపారు. గత 18 నెలల్లో ద్రవ్యోల్బణం, నేరాల రేటును తగ్గించగలిగామని, నాటు సారా నియంత్రణకు తీసుకొచ్చిన ‘మార్పు’ ప్రాజెక్టు రోల్ మోడల్‌గా నిలిచిందని చెప్పారు. సారా తయారీదారులకు పునరావాసం, ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు. తిరుమల ప్రసాదంలో నాణ్యతను పునరుద్ధరించామని, అన్నా క్యాంటీన్లు, పెన్షన్లు వంటి సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని అన్నారు.  రాష్ట్రం 18 నెలల్లోనే రికవరీ అవుతుందని, పునర్నిర్మాణం సాధ్యమవుతుందని తాను కూడా ఊహించలేదని సీఎం పేర్కొన్నారు. ఇప్పటివరకు జరిగిన సమావేశాలన్నింటికంటే ఐదవ కలెక్టర్ల కాన్ఫరెన్స్ అత్యంత విజయవంతంగా జరిగిందని ప్రశంసించారు.  

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అద్భుతమైన ఫలితాలు : సీఎం రేవంత్‌

  తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు అఖండ విజయం సాధించడంపై సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 7,527 స్థానాల్లో విజయం సాధించగా, మరో 808 చోట్ల కాంగ్రెస్ రెబల్స్ గెలుపొందారని తెలిపారు. బీఆర్‌ఎస్ 3,511, బీజేపీ 710 చోట్లు గెలిచినట్లు  ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విజయం ప్రభుత్వ ప్రజాపాలనకు నిదర్శనమని, గ్రామాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.  66%  ఫలితాలు కాంగ్రెస్ పార్టీకే వచ్చాయిని రేవంత్ పేర్కొన్నారు. ఈ ఫలితాలు మా రెండేళ్ల పాలనకు నిదర్శనమని ముఖ్యమంత్రి తెలిపారు. 2029 లో కూడా కాంగ్రెస్ పార్టీదే అధికారం అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ 1/3 స్థానాలు మాత్రమే గెలిచిందని ఇప్పటికైనా అహంకారం, అసూయ తగ్గించుకోవాలని సీఎం హితవు పలికారు . ఈ ఫలితాలతోనైనా బీఆర్‌ఎస్ వాళ్లకి కనువిప్పు కలగాలని కోరుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడం దారుణమని సీఎం అన్నారు. కేంద్రంలోని బీజేపీ.. రాహుల్‌గాంధీపై కోపంతో రాజకీయం చేస్తోందన్నారు. గాంధీ అనే పేరు ఎక్కడా కనిపించకూడదని కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ దురాలోచన చేస్తోందని విమర్శించారు. 

8 నెలల క్రితం ప్రేమ పెళ్లి...భార్యను కొట్టి చంపిన భర్త

  రెండక్షరాల ప్రేమ అనే మత్తులో పడిన యువతి తన తల్లిదండ్రులను ఒప్పించి... ప్రేమపెళ్లి చేసుకొని సంవత్సరం గడవకముందే భర్త తన విశ్వరూపం చూపించడంతో అది భరించలేక మృతి చెందిన ఘటన తల్లిదండ్రులకు కడుపు కోత మిగుల్చింది. వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణంలో ఉన్న సాయిపూర్ ప్రాంతంలో మానవత్వాన్ని కలిచివేసిన దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త, అత్తమామలు కలిసి దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన అనూష (20) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వికారాబాద్ జిల్లాకి చెందిన అనూష, తాండూరు కి చెందిన పరమేష్ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు అంగీకరిస్తూ...ఎనిమిది నెలల క్రితం పరమేష్‌ను, అనూష  ప్రేమ వివాహం చేసుకుంది. కోటి ఆశలతో అత్తారింటిలో అడుగు పెట్టిన అనూషకు వేధింపులే ఎదురైయ్యాయి. అయితే ఈ పెళ్లి పరమేష్ తల్లిదండ్రులకు ఇష్ట్రం లేకపోవడంతో మొదటి నుంచి అనూషను వేధింపు లకు గురి చేస్తున్నారు. ప్రేమ పెళ్లిని అంగీకరించని అత్తమామలు అనూషతో తరచూ గొడవలకు దిగేవారు. ఇటీవల జరిగిన గొడవలో భర్త పరమేష్ కూడా జోక్యం చేసుకుని తల్లిదండ్రులతో కలిసి అనూషపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయ పడిన అనూషను వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అనూష మృతి చెందిన విషయం కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కూతురు మరణించింది అని తెలియగానే ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించసాగారు. అత్త, మామ, భర్త కలిసి ప్రతిరోజు వేధింపులకు గురి చేసే వారిని.. తన కూతురిపై  దాడి చేయడం వల్లే తన కూతురు మరణించింది అంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  అనూష మరణించిందని తెలియగానే  భర్త పరమేష్‌తో పాటు అత్త లాలమ్మ, మామ మొగులప్ప పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అనూష తల్లి చంద్రమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “పలుమార్లు వరకట్నం తీసుకురావాలంటూ నా బిడ్డతో గొడవ పడేవారు. ప్రతిరోజు నా బిడ్డను వేధింపులకు గురిచేసే వారిని... అత్త మామ భర్త ముగ్గురు కలిసి బాగా కొట్టి చివరకు ఆమె ప్రాణాలు తీసేశారు” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటన మరోసారి ప్రేమ వివాహాలపై కుటుంబ విరోధం, వరకట్న వేధింపులు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో స్పష్టం చేస్తోంది. పోలీసులు నిందితులను త్వరగా అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

కమ్మేసిన పొగమంచు.. ఢిల్లీలో విమాన రాకపోకలకు అంతరాయం

దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు ఉదయం పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 40 విమానాల రాకపోకలు జాప్యమయ్యాయి. పది విమాన సర్వీసులు రద్దయ్యాయి.   అలాగే రైళ్ల రాకపోకలలో కూడా తీవ్ర జాప్యం జరిగింది.  ఢిల్లీకి రావలసిన, ఢిల్లీ నుంచి బయలు దేరాల్సిన 22 రైళ్ల రాకపోకల్లో గంటల తరబడి జాప్యం జరిగింది. అదే విధంగా దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ పడిపోవడంతో దేశ రాజధాని నగరంలో ట్రాఫిక్ కు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది.  పొగమంచుతో పాటు, ఢిల్లీలో వాయు కాలుష్యం  కూడా తీవ్రస్థాయికి చేరుకుంది.   వాయు నాణ్యత సూచిక 400 కంటే ఎక్కువగా నమోదైంది. మరి కొన్ని రోజుల పాటు పొగమంచు బెడద కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.  

కల్తీ మద్యం కేసులో జోగి రమేష్‌ సోదరులకు దక్కని ఊరట

  ఏపీ నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్‌ సోదరులకు విజయవాడ ఎక్సైజ్ కోర్టులో ఊరట దక్కలేదు. ఏ2 జగన్‌మోహన్‌రావు, ఏ18 జోగి రమేశ్‌, ఏ19 జోగి రాము బెయిల్‌ పిటిషన్లను విజయవాడలోని ఎక్సైజ్‌ కోర్టు తిరస్కరించింది. కొంతమంది నిందితులకు బెయిల్‌ మంజూరు చేసింది. నేటితో రిమాండ్‌ ముగియనుండటంతో జోగి రమేశ్‌, జోగి రాము సహా 13 మంది నిందితులను అధికారులు న్యాయస్థానంలో హాజరు పర్చారు.   ఈనెల 31 వరకు నిందితులకు న్యాయస్థానం రిమాండ్‌ పొడిగించింది. నకిలీ మ‌ద్యం కేసులో తంబ‌ళ్ల‌ప‌ల్లె టీడీపీ ఇన్‌చార్జ్ జ‌య‌చంద్రారెడ్డి, ఆయ‌న పీఏ, అలాగే అదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన టీడీపీ నాయ‌కుడు సురేంద్ర‌నాయుడి ప్ర‌మేయాన్ని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. దీంతో తంబ‌ళ్ల‌ప‌ల్లె ఇన్‌చార్జ్‌గా జ‌య‌చంద్రారెడ్డి, సురేంద్ర‌నాయుడిని టీడీపీ పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడైన జ‌గ‌న్మోహ‌న్‌రావుతో పాటు మ‌రికొంద‌రిని అరెస్ట్ చేశారు. 

శిశువుల విక్రయ ముఠా అరెస్టు

 ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన పసిపిల్లలను బెజవాడలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.  ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి నెలల వయస్సు చిన్నారులను తీసుకువచ్చి ఈ ముఠా విజయవాడ కేంద్రంగా విక్రయాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా ఒక్కో శిశువునూ మూడున్నర నుంచి ఐదులక్షల రూపాయలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠాకు చెందిన ఆరుగురు మహిళలు, ఏడుగురు పురుషులను  పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న ఐదుగురు శిశువులను ఐసీడీఎస్‌కు తరచి ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

నీరో చక్రవర్తిలా ఎఫ్బీఐ డైరెక్టర్

అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో గతవారం కాల్పుల ఘటన చోటుచేసుకోగా.. ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కాల్పులకు తెగబడిన నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి పాడ్‌కాస్ట్‌లో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అతడిని రోమ్ నగరం కాలిపోతుంటే ఫిడేల్ వాయిస్తూ కూర్చున్న నీరో చక్రవర్తితో పోలుస్తూ చట్టసభ సభ్యులు, ఎఫ్బీఐ మాజీ ఏజెంట్లు దుమ్మెత్తి పోస్తున్నారు. దేశం జరిగిన ఘోరంపై పోరాడుతుంటే, వ్యక్తిగత బలహీనతలకు ప్రాధాన్యత ఇస్తూ ఎఫ్బీఐ డైరెక్టర్ బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్‌పై గతంలోనూ వనరుల దుర్వినియోగం సహా పలు ఆరోపణలు ఉన్నాయి.    ఇటీవల బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పుల ఘటన చోటుచేసుకోగా.. నిందితుడి కోసం దేశవ్యాప్తంగా గాలింపు కొనసాగుతోంది. ఈ క్రమంలో కాష్ పటేల్  తన గర్ల్‌ఫ్రెండ్ అలెక్సిస్ విల్కిన్స్‌తో కలిసి ఒక పాడ్‌కాస్ట్‌‌కు కాష్ హాజరుకావడంపై  తీవ్ర చర్చ జరుగుతోంది.  వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ..  అత్యవసర బాధ్యతలను కాష్ పటేల్ విస్మరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాష్ పటేల్, తన ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్‌తో కలిసి కన్జర్వేటివ్ పాడ్‌కాస్టర్ కేటీ మిల్లర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. బ్రౌన్స్ యూనివర్సిటీలో కాల్పులకు పాల్పడిన దుండగుడి కోసం స్థానిక పోలీసులు గాలిస్తున్న సమయంలో ఆయన పాడ్‌కాస్టర్‌లో పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశం తీవ్రమైన నేరంతో పోరాడుతుంటే ఆయనకు విలాసాలకు సమయం దొరికిందా? అని దుమ్మెత్తిపోస్తున్నారు. తన గర్ల్‌ఫ్రెండ్ కోసం గతంలో కూడా పటేల్ ఎఫ్‌బీఐ వనరులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. విల్కిన్స్ ప్రదర్శనలకు ఎఫ్‌బీఐ విమానంలో వెళ్లడం, ఆమెకు ఎఫ్బీఐ రక్షణ కల్పించడం, మత్తులో ఉన్న ఆమె స్నేహితుడిని   ఇంటికి  తీసుకెళ్లాలని ఏజెంట్లను ఆదేశించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను అప్పట్లో కాష్ పటేల్ ఖండించినప్పటికీ, బ్రౌన్ షూటింగ్ దర్యాప్తు సమయంలో ప్రియురాలితో చెట్టపట్టాలేసుకుని తిరగడంతో అవి  మళ్లీ తెరపైకి వచ్చాయి. కేటీ మిల్లర్ విడుదల చేసిన టీజర్‌లో పటేల్, విల్కిన్స్ నవ్వుతూ తమ సంబంధం గురించి బహిరంగంగా మాట్లాడుకున్నారు. ఈ క్లిప్ వైరల్ అవ్వడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పాడ్‌కాస్ట్‌లో విల్కిన్స్ తనపై వచ్చిన ‘మొసాద్ హనీపాట్’ ఆరోపణలను ఖండించారు. తాను యూదు, ఇజ్రాయెల్‌కు చెందినదాన్ని కాదని ఆమె స్పష్టం చేశారు. ఈ ఆరోపణలు తన భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని పేర్కొంటూ  లీగల్ కన్సల్టెంట్ సాయంతో ఆమె దావా వేశారు. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ ఈ క్లిప్‌ను రీపోస్ట్ చేస్తూ.. బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పులకు తెగబడిన దుండగుడు ఇంకా స్వేచ్ఛగా తప్పించుకుని తిరుగుతుంటే.. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌కు తన గర్ల్‌ఫ్రెండ్‌తో తిరగడానికి, పాడ్‌కాస్ట్‌లో పాల్గొనడానికి ప్రజలు చెల్లించే పన్నులతో నడిచే ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించడానికి సమయం దొరికిందని విమర్శించారు. ఎఫ్‌బీఐ మాజీ  ఏజెంట్ కైల్ సెరాఫిన్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. మనం ఏ కాలంలో జీవిస్తున్నాం? ఇలాంటి వాళ్లను ఏం చేయాలని ప్రశ్నించారు. కాగా, బ్రౌన్ యూనివర్సిటీ కాల్పుల కేసులో అనుమానితుడి కొత్త ఫోటోలను ఎఫ్‌బీఐ విడుదల చేసింది. దుండగుడిని పట్టుకోవడానికి సమాచారం అందించిన వారికి 50,000 డాలర్లు రివార్డు ప్రకటించింది.

నాంపల్లి కోర్టుకు బాంబు బెదరింపు

హైదరాబాద్  నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది.  కోర్టు భవనంలో బాంబు అమ ర్చామనీ,  మధ్యాహ్నం 2 గంటలకు పేలిపోతుందంటూ గుర్తు తెలియని వ్యక్తి  నుంచి ఈమెయిల్ రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు.  వెంటనే కోర్టు వద్దకు చేరుకున్న పోలీసులు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. అలాగే న్యాయమూర్తులు సహా  కోర్టులో ఉన్న న్యాయవాదులు, సిబ్బంది, ప్రజలను బయటకు పంపించి, కోర్టు భవనాన్ని, ప్రాంగణాన్ని  పూర్తిగా ఖాళీ చేయించారు.   బాంబు బెదరింపుతో కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్త వతావారణం నెలకొంది.  బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి కోర్టు లోపలా, వెలుపలా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.  కొర్టులోని ప్రతి గది, కారిడార్, కోర్ట్ హాల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వస్తువుల కోసం ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.అకస్మాత్తుగా కోర్టు ఖాళీ చేయడంతో న్యాయవాదులు, కేసుల కోసం వచ్చిన జనం భయాందోళనలకు గుర య్యారు.   కోర్టు పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేసి, తనిఖీలు పూర్తయ్యే వరకు ఎవరినీ లోపలికి అనుమతించ లేదు. అదే సమయంలో ఈ బాంబు బెదిరింపు నిజమా లేక తప్పుడు సమాచారమా అన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. అదే విధంగా  ఈమెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం రంగంలోకి దిగింది. 

చంద్రబాబు రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ప్రతిష్ఘాత్మక అవార్డు వరించింది. ప్రముఖ దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ఏటా ప్రదానం చేసే  బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం ఈ సారి చంద్రబాబుకు దక్కింది.  ఆంధ్రప్రదేశ్ లో ఆయన అమలు చేస్తున్న  వ్యాపార అనుకూల విధానాలు, పారిశ్రామిక సంస్కరణలు,  అలాగే పెట్టుబడుల ఆకర్షణకు గానూ ఆయనకీ అవార్డు ప్రదానం చేస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ గురువారం (డిసెంబర్ 18) ప్రకటించింది.   వచ్చే ఏడాది మార్చిలో  నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా చంద్రబాబు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.  రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన 18 నెలల స్వల్ప కాలంలోనే రాష్ట్రానికి 10.7 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడులను ఆకర్షించి, రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి బాటలు వేసిన చంద్రబాబును ఎకనామిక్ టైమ్స్ ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. ఈ అవార్డుకు చంద్రబాబును  దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, న్యాయవేత్తలతో కూడిన అత్యున్నత స్థాయి జ్యూరీ ఎంపిక చేసింది. ఈ జ్యూరీలో భర్తీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్,  జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్, నారాయణ హెల్త్ వ్యవస్థాపకుడు డాక్టర్ దేవిశెట్టి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా వంటి ప్రముఖులు   ఉన్నారు. జ్యూరీకి డెలాయిట్ సంస్థ సలహాదారుగా వ్యవహరిస్తోంది. ఈ అవార్డును గతంలో కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, ఎస్. జైశంకర్ , నిర్మలా సీతారామన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవిస్, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్ వంటి వారు అందుకున్నారు. ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడంపై ప్రముఖులు, మంత్రి వర్గ సహచరులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.