జనం కోసం జగ్గారెడ్డి ధర్నా
posted on Mar 25, 2021 @ 3:58PM
ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆందోళనకు దిగారు. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరుతూ నిరసన చేపట్టారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని, నియోజకవర్గ అభివృద్ధికి వెయ్యి కోట్లు కేటాయించాలని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర తన కుమార్తె జయారెడ్డితో కలిసి నిరసన తెలిపారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేశారు.
నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాకపోవడంతో ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేశానన్నారు జగ్గారెడ్డి. నియోజవర్గ అభివృద్ధికి 2వేల కోట్లు ఇవ్వాలని అడిగితే సర్కారు నుంచి స్పందన లేదు. అసెంబ్లీలో మాట్లాడేందుకు మా పార్టీకి కొంచెం సమయం ఇచ్చి మైక్ కట్ చేస్తున్నారని మండిపడ్డారు. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపితే సిద్దిపేటకు తరలించారని ఆరోపించారు. 2013లో 5వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే.. టీఆర్ఎస్ సర్కారు వచ్చాక వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారని తప్పుబట్టారు. నియోజకవర్గంలో 40వేల మంది పేదలు ఇళ్లు లేక ఇబ్బంది పడుతుంటే.. వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వమంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సర్కారు స్పందించి సంగారెడ్డి నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.