ఏపీకి వచ్చేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి : మంత్రి నారా లోకేశ్
posted on May 13, 2025 @ 7:10PM
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. .ఉండవల్లిలోని తన నివాసంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. నూతన పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్న సంస్థలకు సత్వర అనుమతులు, పూర్తిస్థాయి సహకారం అందించాలని అధికారలను మంత్రి ఆదేశించారు. ఏపీలో రూ.91,839 కోట్ల పెట్టుబడితో, 1,41,407 ఉద్యోగాలను కల్పించేందుకు సుమారు 91 దిగ్గజ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.
రాబోయే ఐదేళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. విశాఖపట్నం నగరాన్ని అత్యాధునిక ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఐటీ కంపెనీలకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.పెద్ద కంపెనీలకు అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేసేందుకు ప్రతి కంపెనీకి ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించాలని అధికారులను ఆదేశించారు.