మల్లన్నకు పదవీ టెన్షన్! పల్లా ఫీవర్..
posted on Mar 26, 2021 @ 12:19PM
కేసీఆర్ ప్రధాని అయితే దేశ చరిత్ర మారిపోతుందంటూ మల్లన్న జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్ పీఎం కావాలి. మంత్రి మల్లారెడ్డి కోరిక ఇది. కేసీఆర్ పీఎం అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లే దేశాన్ని కూడా ప్రగతిపథంలోకి తీసుకెళ్తారట. ప్రజలకు సమస్యలే ఉండవట. సమయం, సందర్భం లేకుండా సడెన్‌గా ఆయన కేసీఆర్ భజన ఎందుకు చేశారనేది ఆసక్తికరం.
మల్లారెడ్డికి మంత్రిగండం పొంచి ఉందని అంటున్నారు. త్వరలోనే ఆయన పదవి ఊస్ట్ అని చెబుతున్నారు. వెంటనే మల్లారెడ్డి సాబ్‌ను తీసేయాలని గులాబీ బాస్ మనసులో లేకపోయినా.. తనకిష్టమైన, పార్టీకి సరికొత్త ట్రబుల్ షూటర్‌గా మారిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకోవాలని కేసీఆర్ తెగ ఆరాటపడుతున్నారట. సామాజిక వర్గ సమతూకంలో భాగంగా.. రెడ్డి వర్గానికి చెందిన పల్లాను మంత్రిమండలిలోకి తీసుకుంటే.. అదే వర్గానికి చెందిన మరో మంత్రిని మైనస్ చేయాల్సి ఉంటుంది. ఆ ఎలిమినేషన్ ప్రాసెస్‌లో మిగతా మంత్రుల కంటే ముందున్నారట మల్లన్న. అందుకే, ఎక్కడ తన పదవి పోతుందోననే టెన్షన్ మల్లారెడ్డిని వేధిస్తోంది.
గత పార్లమెంట్ ఎలక్షన్‌లో ఏరికోరి మరి మల్లారెడ్డి అల్లుడికి మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇస్తే.. ఆయన రేవంత్‌రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. అప్పట్లో రాజకీయాలకు కొత్త వాడైన మర్రి రాజశేఖర్‌ను గెలిపించే బాధ్యత మల్లారెడ్డికి అప్పగించినా.. అందులో ఆయన విఫలమయ్యారనే అపవాదు ఉంది. ఇక కార్మిక శాఖ మంత్రిగా పెద్దగా సాధించింది కూడా ఏమీ లేదు. మరోవైపు.. సొంతపార్టీ నేతలతో పొసగకపోవడం.. ఆయనపై పెద్ద ఎత్తున భూకబ్జా ఆరోపణలు రావడం.. మల్లారెడ్డి మంత్రి పదవికి ఎసరు పెట్టేలా ఉంది. సవాల్‌గా మారిన స్థానం నుంచి రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టి ఆయనకు పట్టం కట్టాలని కేసీఆర్ భావిస్తున్నారట.
ఇప్పటికే పాలనలో ఆఫ్ టర్మ్ పూర్తి చేసుకున్న కేసీఆర్.. త్వరలోనే కేబినెట్‌లో మార్పులు, చేర్పులు చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఆ సమయంలో మల్లారెడ్డి స్థానంలో పల్లా మంత్రి మండలిలో చేరుతారని అంటున్నారు. మల్లన్నకు మంత్రి పదవి భయం పట్టుకుందని.. అందుకే, అసెంబ్లీలో కేసీఆర్ పీఎం కావాలంటూ పొగడ్తలతో ముంచెత్తి.. గులాబీ బాస్‌ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. ఇలాంటి కాకా పట్టే.. భజనలకు పొంగిపోతే ఆయన కేసీఆర్ ఎందుకవుతారు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు మల్లన్నా..?