10 వేలు తీసుకున్నవారే ధర్నాలో కూర్చున్నారు! విపక్షాలది బురద రాజకీయమన్న కేటీఆర్
posted on Nov 8, 2020 @ 11:46AM
గ్రేటర్ హైదరాబాద్ లో ప్రభుత్వం చేస్తున్న వరద సాయంపై ప్రతిపక్షాలు బురద రాజకీయం చేస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజలు, ప్రతిపక్షాలు అడగకముందే వరద సాయం కోసం 550 కోట్ల రూపాయలను ప్రకటించామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటివరకు 4 లక్షల 30 వేల కుటుంబాలకు 10 వేల రూపాయల సాయం అందించామని తెలిపారు. 3 లక్షల 80 వేల కుటుంబాలు GHMC పరిధిలో, 12 వేల కుటుంబాలు కంటోన్మెంట్ పరిధిలో, 40 వేల సిటీ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలకు అందించామన్నారు. 920 అధికారిక బృందాల ద్వారా ఒకేరోజు లక్ష మందికి డబ్బులు ఇచ్చామన్నారు కేటీఆర్.
10 వేల సాయం పొందిన ప్రతీ ఒక్కరి వివరాలు తమ దగ్గర ఉన్నాయన్నారు మంత్రి కేటీఆర్. సిటీ లో ఇంకా కొన్ని కాలనీలు నీటిలోనే ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరికి సాయం అందిస్తామని ప్రకటించారు. మిగిలిన వారికి కూడా పదివేల సాయం ఇవ్వాలని సీఎం చెప్పారని తెలిపారు. 10 వేల రూపాయలు తీసుకున్న వారే కొందరు ప్రతిపక్షాలు చేస్తున్న ధర్నాలో కూర్చుంటున్నారని కేటీఆర్ చెప్పారు. ఇంకొక వంద కోట్లు ప్రకటించమని సీఎంని కోరి అయినా అర్హులందరికీ వరద సాయం అందేలా చూస్తామని కేటీఆర్ ప్రకటించారు.
వరదల వల్ల 8,868 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాసినా ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు కేటీఆర్. గతంలో కర్ణాటక, గుజరాత్ లో వరదలు వచ్చినపుడు తక్షణమే కేంద్రం నిధులు పంపించిందని తెలిపారు. ఆరేండ్లలో తెలంగాణ నుండి 2 లక్షల 72 వేల కోట్లు పన్నులు కేంద్రానికి కడితే 1లక్షా నలభై వేల కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయన్నారు. నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి ఒక్క పైసా తీసుకురాలేదని కేటీఆర్ విమర్శించారు. దుబ్బాకలో కాంగ్రెస్ కి డిపాజిట్ రాదన్నారు మున్సిపల్ శాఖ మంత్రి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు కబ్జాలను అరికడితే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. వర్షాల వల్ల జరిగిన నష్టం పై అధికారులు అంచనా వేస్తున్నారని చెప్పారు కేటీఆర్.
1908, 1916 తర్వాత ఈసారి హైదరాబాద్ లో అతిపెద్ద వర్షపాతం నమోదైందన్నారు కేటీఆర్. 120 సెంటిమీటర్ల వర్షం కురిసిందన్నారు. ఒకేసారి కుంభవృష్టి లాగా అసాధారణ వర్షం కురవడం వల్లే వరద తీవ్ర ప్రభావం చూపిందన్నారు. నాళాలు కబ్జా చేయడం, చెరువులు కబ్జాల వల్ల వందలాది కాలనీలు మునిగాయన్నారు. ఏ సిటీ లో లేని విధంగా హైదరాబాద్ లో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ని ఏర్పాటు చేశామన్నారు కేటీఆర్. మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరు వరదల సమయంలో జనాల దగ్గరికి వెళ్లి కష్టాలు తెలుసుకున్నారని చెప్పారు.