చంద్రబాబు మాటలు వింటే నువ్వు కూడా మటాష్.. హీరో రామ్ కు కొడాలి నాని హితవు
posted on Aug 25, 2020 @ 5:48PM
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ అగ్నిప్రమాదం కేసులో హీరో రామ్ ట్వీట్స్ ద్వారా స్పందించడంపై రాజకీయపరంగా తీవ్ర కలకలం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో ఇటు సోషల్ మీడియాలోను అటు బహిరంగంగాను కొంత మంది మండిపడ్డారు. తాజాగా ఈ విషయంలో హీరో రామ్ ట్వీట్స్ పై మంత్రి కొడాలి నాని కౌంటరిచ్చారు.
హీరో రామ్ చంద్రబాబు మాట వినకపోవడం మంచిదని అయన సలహా ఇచ్చారు. ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని చంద్రబాబు టీడీపీలో ఎలా చేరారో, తరువాత తిన్నింటి వాసాలు లెక్కబెట్టి ఎన్టీఆర్‌కు ఎలా వెన్నుపోటు పొడిచారో, పార్టీ, పదవిని ఎలా లాగేసుకున్నారో ఇవన్నీ అందరికి తెలుసని నాని అన్నారు. చంద్రబాబు మాటలు వింటే అటు సినిమా కెరీర్, ఇటు రాజకీయ జీవితం ఏమవుతుందో ప్రముఖ హీరోలు అయిన తోటి ఆర్టిస్టులు పవన్ కల్యాణ్, ఎన్టీఆర్‌లను అడిగితే చెబుతారని కొడాలి నాని హితవు చెప్పారు.
అసలు ఏ తప్పు చేయకపోతే డాక్టర్ రమేశ్ ఎందుకు పారిపోతారని నాని ఈ సందర్భంగాగా ప్రశ్నించారు. రమేశ్ ఆసుపత్రి యజమాని వెనుక పెద్ద పెద్ద నాయకులు ఉన్నారని, అంతేకాకుండా రమేశ్ ఎక్కడ ఉన్నారో అందరికీ తెలుసునని చెపుతూ.. చంద్రబాబు ఇంట్లోనే రమేశ్ తలదాచుకున్నారని కొడాలి నాని తీవ్ర ఆరోపణలు చేసారు. మహిళల్ని ముందు పెట్టుకుని డాక్టర్ రమేశ్ పారిపోయారని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారని.. ఆయన కేవలం కమ్మ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని నాని తీవ్రంగా దుయ్యబట్టారు. తనకు తన పార్టీకి విరాళాలు ఇచ్చే వారికి అనుకూలంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని.. డాక్టర్ రమేశ్‌ను కాపాడేందుకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రయత్నం జరుగుతోందని మంత్రి ఆరోపించారు. కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం వైఎస్ జగన్‌కు లేదని, చంద్రబాబుకు వయస్సు పెరిగినా బుద్ధి రాలేదని మండిపడ్డారు.