ఏపీ లో ఇప్పటివరకూ 11,615 శాంపిల్స్ టెస్ట్ చేసాం: ఆళ్ళ నాని
posted on Apr 15, 2020 @ 9:40PM
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 11,615 శాంపిల్స్ టెస్ట్ చేసినట్టు డిప్యూటీ ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. వీటిలో 11,111 నెగిటివ్, 502 పాజిటివ్ వచ్చినట్టు ఆయన చెప్పారు. ఇప్పటివరకు 16 మంది చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారని, క్వారెంటీన్స్ లో సదుపాయలపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన పేర్కొన్నారు. పేద వారిగా ఉన్నవాళ్లను క్వారెంటీన్ నుండి ఇంటికి పంపేటప్పుడు 2 వేలు ఆర్ధిక సహాయం చేస్తున్నామన్నారు. క్వారెంటీన్ సెంటర్ పర్యవేక్షణకు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసామనీ, క్వారెంటీన్ నుండి బయటకి పంపేటప్పుడు సర్టిఫికెట్ ఇస్యూ చేస్తామనీ కూడా డెప్యూటీ సి ఎం చెప్పారు. డిశ్చార్జ్ విషయంలో కొంత గందరగోళం ఉంది.. దీనిపై విధివిధానాలు రూపిండిస్తున్నామన్నారు. ఇప్పటివరకూ మూడు సార్లు సమగ్ర కుటుంబ సర్వే చేసామని, సర్వే ద్వారా 32 వేల మందిని గుర్తించామని, 8 వేల మందికి లక్షణాలు ఉన్నాయని, అయినా 32 వేల మందికి దశల వారిగా కరోనా టెస్ట్ లు చెయ్యమని సీఎం ఆదేశించినట్టు ఆయన వివరించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం వైద్య పరికరాల కొరత లేదని, రాష్ట్రంలోనే ప్రతిరోజు సొంతంగా 10 వేలు పీపీఈ కిట్స్ తయారు చేస్తున్నామని, మరో 10 వేలు బయట నుండి తెప్పిస్తున్నామని, N95 తో పాటు మందులు అందుబాటులో ఉన్నాయని, వీటిపై దుష్ప్రచారం చేయొద్దని, ప్రజల సహకారంతోనే లాక్ డౌన్ విజయవంతంగా అమలు జరుగుతోందని డెప్యూటీ ముఖ్యమంత్రి చెప్పారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఏపీలో విజయవంతంగా అమలు అయ్యిందన్నారు. రానున్న రోజుల్లోనూ లాక్ డౌన్ ని మరింతగా పాటించాలన్నారు.