ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్న యం.ఐ.యం.
posted on Jan 11, 2013 @ 2:42PM
యం.ఐ.యం.పార్టీ శాసన సభ్యుడు అక్బరుదీన్ ఓవైసీ లండన్ నుండి హైదరాబాదులో కాలుపెట్టిన ప్పటినుండీ, ఈ రోజు వరకూ కూడా నగరంలో చుట్టుపక్కల జిల్లాలలోకూడా ప్రశాంతత కరువయింది. ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజల మద్య యం.ఐ.యం.పార్టీ శాసన సభ్యుడు చిచ్చుపెట్టడమే కాకుండా, అతనిని పోలీసులు అరెస్ట్ చేసినందుకు ఆ పార్టీ అల్లర్లను ప్రోత్సాహిస్తుండటం విచారకరం.
యం.ఐ.యం. పార్టీ ఒకవైపు తమది లౌకికవాద పార్టీ అని చెప్పుకొంటూనే మరో వైపు తమ శాసన సభ్యుడు అక్బరుదీన్ చేసిన విద్వేష ప్రసంగాన్ని సమర్దించుకొంటూ ద్వంద వైఖరిని ప్రదర్శిస్తోంది. అది చాలదన్నట్లు, కోర్టులు, చట్టాల పై తమకు పూర్తీ నమ్మకం ఉందని పలికిన నోటితోనే, చట్టాలను, పోలీసు వ్యవస్థను పరిహసిస్తున్నట్లు అల్లర్లను ప్రోత్సహిస్తోంది. యం.ఐ.యం.పార్టీ చెపుతున్న మాటలకి అది చేస్తున్న పనులకి ఎక్కడా పొంతన లేదు.
అక్బరుదీన్ కు జరిగినది ఘోర అన్యాయమని, అది అతనికేగాక యావత్ మైనార్టీ వర్గాలకు జరిగిన అన్యాయంగా చిత్రీకరించి చూపేందుకు ప్రయత్నిస్తూ, మైనార్టీ వర్గాలకు తామే అసలుసిసలయిన ప్రతినిదులము, రక్షకులమన్నట్లు వ్యహవహరిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలను పణంగా పెట్టి రాజకీయంగా ఎదగాలని ప్రయత్నిస్తోంది. దేశ వ్యాప్తంగా అనేకమంది ముస్లిం మేధావులు ఈ ధోరణిని తీవ్రంగా ఖండించినా పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నయం.ఐ.యం.పార్టీ, ముస్లిమేతరులు తమకు వ్యతిరేఖంగా పలికే ప్రతీ మాటను మాత్రం ఆయుధంగా మలుచుకొని ముందుకు సాగడం నీచ రాజకీయాలకి పరాకాష్టగా చెప్పవచ్చును.