పాతబస్తిలో పతంగికి ఎదురుగాలి! గ్రేటర్ ఛేంజ్ కానుందా?
posted on Nov 30, 2020 @ 1:14PM
తెలంగాణ రాజకీయాలనే కాదు దేశ వ్యాప్తంగా చర్చగా మారిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అద్బుతాలు జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఓల్ట్ సిటీలో తమకు తిరుగులేదని భావిస్తున్న ఎంఐఎం పార్టీకి ఊహించని ఫలితాలు రావొచ్చనే ప్రచారం జరుగుతోంది. పాతబస్తిలో పతంగి పార్టీకి ఎదురు గాలి వీస్తోందని, ఆ పార్టీకి గతంలో వచ్చిన సీట్ల కంటే చాలా వరకు తగ్గుతాయని చెబుతున్నారు. ఎంఐఎంకి గట్టి పట్టున్న ప్రాంతాల్లోనూ ప్రజల్లో మార్పు కనిపిస్తుందని, గ్రేటర్ ఎన్నికల్లో ఆ పార్టీకి షాక్ తప్పదని ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మేధావులే బల్ల గుద్ది చెబుతున్నారంటే పరిస్థితి ఎలా అర్ధం చేసుకోవచ్చు.
2016లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 61 డివిజన్లలో పోటీ చేసిన ఎంఐఎం 44 డివిజన్లు గెలిచింది. ఇందులో జాంబాగ్ లో కేవలం ఐదు ఓట్ల మెజార్టీతో గెలవగా.. మరికొన్ని డివిజన్లలోనూ వందల ఓట్ల తేడాతోనే పతంగి పార్టీ గట్టెక్కింది. ఈసారి కేవలం 51 డివిజన్లకే పరిమితమైన ఎంఐఎం.. 47 సీట్లను టార్గెట్ గా పెట్టుకుంది. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో గతంలో ఓడిపోయిన డివిజన్లతో పాటు రాజేంద్రనగర్ నియోజకవర్దంపై అసద్, అక్భర్ ఎక్కువ ఫోకస్ చేశారు. అయితే ప్రస్తుతం పరిస్థితులను చూస్తే అక్భర్ సొంత నియోజకవర్గం చాంద్రాయణ గుట్టలోనే ఎంఐఎంకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెబుతున్నారు. గ్రేటర్ లో ఈసారి గతంలో వచ్చిన వాటి కంటే 10 సీట్ల వరకు ఎంఐఎంకు తగ్గవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎంఐఎం ఎంతగా కష్టపడినా.. ఆ పార్టీకి ఈసారి గ్రేటర్ లో 35 సీట్లకు మించవని ఖచ్చితంగా చెబుతున్నారు.
పాతబస్తిలో కొన్ని రోజులుగా ఎంఐఎంపై ముస్లింల్లోనే బాగా వ్యతిరేకత కనిపిస్తోంది. ఎంఐఎం ప్రజా ప్రతినిధులు ప్రజలను పట్టించుకోవడం లేదని, స్థానిక సమస్యలను పరిష్కరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలప్పుడు మాత్రమే కనిపిస్తారని, తర్వాత ఎవరూ అందుబాటులో ఉండనే విమర్శలు ఎక్కువయ్యాయి. ఇటీవల వచ్చిన వరదల సమయంలో ఎంఐఎం నేతల తీరుపై ముస్లింలు తీవ్రంగా ఆగ్రహంగా ఉన్నారు. నాలుగైదు రోజుల పాటు మోకాళ్ల లోతు నీటిలోనే ఉండి నరకం చూస్తున్నా.. ఎవరూ స్పందించలేదనే ఆరోపణలున్నాయి. వరదల సమయంలో ఎంఐఎంకి వ్యతిరేకంగా ఓల్ట్ సిటీలోని పలు ప్రాంతాల్లో ముస్లింలు ఆందోళన చేయడం, అసద్ కు వ్యతిరేకంగా ముస్లిం మహిళలు స్లోగన్ చేయడం అందరిని అశ్చర్యపరిచింది. వరద సాయం పంపిణిలో జరిగిన అవకతవకలు ఎంఐఎం పార్టీపై ప్రజల్లో మరింత వ్యతిరేకంగా పెంచాయి.
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎంకు ప్రజా గ్రహం స్పష్టంగా కనిపించింది. గతంలో ఎంఐఎం పార్టీ గురించి మాట్లాడాలంటేనే పాతబస్తీలో భయపడేవారు. ఒవైసీల గురించి అయితే అసలు చెప్పనవరసం లేదు. అలాంటి సీన్ పూర్తిగా రివర్సైంది. ఏకంగా ఒవైసీ బ్రదర్స్ నే నిలదీశారు ఓల్ట్ సిటీ ఓటర్లు. జాంబాగ్ ఎంఐఎం అభ్యర్థి రవీందర్ తరుఫున ప్రచారానికి వెళ్లిన ఎంపీ అసదుద్దీన్‌ను స్థానిక ముస్లిం మహిళలు అడ్డుకున్నారు. వరద సాయంపై వారు అసద్ కు ప్రశ్నల వర్షం కురిపించారు. మహిళల నిరసనతో అసదుద్దీన్ షాక్ తిన్నారు. ముషిరాబాద్ లో అక్భరుద్దీన్ కు నిరసన సెగ తగిలింది. ఎన్నికల సభలో అక్భర్ మాట్లాడుతుండగా ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమకు వరద సాయం అందలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో అసహనానికి గురైన అక్భరుద్దీన్ ప్రసంగించడం ఆపేసి వేదిక దిగి వెళ్లిపోయారు.
పాతబస్తిలోని చాలా డివిజన్లలో ఇదే పరిస్థితి కనిపించింది. కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులను స్థానిక సమస్యలపై ఓటర్లు ఎక్కడికక్కడ నిలదీశారు. పాతబస్తీలో వచ్చిన మార్పులతో ఈసారి ఎంఐఎంకు షాకిచ్చే ఫలితాలు వస్తాయని అంతా భావిస్తున్నారు. అయితే ఓల్డ్ సిటీలో పతంగి పార్టీపై ప్రజల్లో ఆగ్రహం ఉన్నా.. దాన్ని పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకోవడంలో ప్రత్యర్థి పార్టీలు సక్సెస్ కాలేదనే మరో చర్చ కూడా జరుగుతోంది. బలహీన అభ్యర్థులను పెట్టడం, ముఖ్య నేతలు ప్రచారం చేయకపోవడంతో ఎంఐఎంకి కొంత కలిసి వచ్చిందంటున్నారు. బీజేపీ ఓల్డ్ సిటీపై మరింత ఫోకస్ చేస్తే ఎంఐఎంకి గతంలో కంటే సగానికి పైగా సీట్లు తగ్గేవని చెబుతున్నారు. ప్రత్యర్థి పార్టీలు సీరియస్ ఎఫర్ట్ పెట్టకోపోయినప్పటికి ఈసారి గ్రేటర్ లో ఎంఐఎం సీట్లు తగ్గడం ఖాయమంటున్నారు. బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఎంపీ అర్వింద్ తో పాటు గ్రేటర్ ప్రచారంలో పాల్గొన్న బీజేపీ నేతల ప్రసంగాలు కూడా కొంత ప్రభావం చూపించాయని అంటున్నారు. ఎంఐఎంపై కోపంగా ఉన్నా.. బీజేపీ నేతల మాటల వల్ల కొందరు ఓటర్లు విధిలేని పరిస్థితుల్లో అయిష్టంగానే పతంగి పార్టీకి సపోర్ట్ చేస్తున్నారనే చర్చ కూడా వస్తోంది.