బీహార్ ఎన్నికలు.. ట్రంప్ కార్డుగా పీకే పార్టీ?
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య తేడా కేవలం ఒక శాతం కంటే తక్కువేనని సర్వేలు ఉద్ఘాటిస్తున్నాయి. బీహార్ లో ఎన్డీయే, ఇండియా కూటములు మధ్య పోరు హోరాహోరీ అని పరిశీలకులు సైతం ఉదాహరణలతో విశ్లేషణలు చేస్తున్నారు. ఈ సారి బీహార్ లో హంగ్ ఖాయమని చెబుతున్నారు. అంతేనా బీహార్ లో ఎన్డీయ, ఇండీ కూటములు సొంతంగా అవసరమైన స్థానాలను గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. హంగ్ ఖాయమనీ, దాంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పార్టీ జన సురాజ్ కీలకంగా మారుతుందనీ అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే బీహార్ లో ఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా ప్రశాంత్ కిశోర్ మద్దతు అనివార్యమౌతుందని చెబుతున్నారు. అంటే ప్రశాంత్ కిశోర్ కింగ్ మేకర్ గా, ట్రంప్ కార్డుగా మారతారన్న మాట.
అయితే ఇటు ఇండియా కూటమి, అటు ఎన్డీయే కూటమి కూడా తమ విజయం ఖాయమన్న ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా ఎన్డీఏ కూటమి,ఇండియా కూటమి మధ్య ప్రధాన పోటీ జరిగే అవకాశం ఉంది. అలాగే చిరాగ్ పాశ్వాన్ పార్టీ, ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ పార్టీలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. సాధారణంగా ఓట్లు చీలితే ప్రత్యర్ధి పార్టీకి దెబ్బ అని ఎన్నికల విశ్లేషకులు చెబుతారు. కాని పీకే పార్టీ అధికార పార్టీ ఓట్లనే చీల్చి దాన్నే డ్యామేజ్ చేస్తుందని అంటున్నారు. ముఖ్యంగా పీకే పార్టీ పట్ల యువత ఆకర్షితులౌతున్నారన్నది రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న మాట. అలాగే చిరాగ్ పాశ్వాన్ గతంలో పోటీ చేసిన స్థానాల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. ఈ సారీ కూడా అదే ఫలితం రావచ్చని అంటున్నారు.
గత రెండు నెలలుగా ప్రచారంలో ఎన్డీఏ, ఇండీ కూటములు హోరాహోరీగా తలపడుతున్నాయి. ముఖ్యంగా . రాహుల్ గాంధీ 64 లక్షల ఓట్లు చోరీ పేరుతో ఎన్నికల కమిషన్ పై ఆరోపణల అస్త్రాలు సంధించడంతో అందరి చూపు బీహార్ ఎన్నికల పై మళ్లింది. ఎన్నికల కమిషన్ మళ్లీ ఓటర్ల జాబితాను పున:పరిశీలించి కొత్తగా 14 లక్షల ఓట్లు చేరాయని ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 7.4 కోట్ల ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. అది పక్కన పెడితే రాహుల్ ఓట్ చోరీ యాత్రకు బీహార్ వ్యాప్తంగా విశేష స్పందన వచ్చింది. దీంతో ఇండియా కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. నిన్న మొన్నటి వరకూ ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, ఆర్జేడీ కీలక నేత అయిన తేజస్వీయాదవ్ అన్న విషయంలో రెండో అభిప్రాయానికి తావు లేదన్నట్లుగా ఉన్న పరిస్థితి మారింది. ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవర్నది ఇంకా నిర్ణయించలేదంటూ కాంగ్రెస్ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఓట్ చోరి యాత్ర ద్వారా వచ్చిన మైలేజీయే ఇందుకు కారణమన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తం అవుతోంది. ఇది ఆ కూటమిలో ఒకింత అసంతృప్తికి కారణమైంది. అవసరమైతే ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఒక సందర్భంలో హెచ్చరించారు కూడా.
అది పక్కన పెడితే లోక్ జనశక్తి నాయకుడు చిరాగ్ పాశ్వాన్ బీజేపీతో పొత్తు విషయంలో నితీష్ వారసుడిగా కావాలని ఆశిస్తున్నారు. అయితే ఇందుకు బీజేపీ అవకావాలు లేవు. దీంతో చిరాగ్ పశ్వాన్ పీకే పార్టీ జన సురాజ్ తో పొత్తుపెట్టుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు. జన సురాజ్ తో పొత్తుపై చిరాగ్ పశ్వాన్ సూచన ప్రాయంగా సానుకూల సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే అది బీజేపీపై ఒత్తిడి పెంచి ఎక్కువ స్థానాలను సాధించాలన్న ఎత్తుగడగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీహార్ ఎన్నికల బరిలోకి దిగడంతో పరిస్థితి మరింత రసకందాయంలో పడిందని చెప్పారు. ఆప్ కూడా రాష్ట్రంలో పొత్తులకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇక జేడీయూ విషయానికి వస్తే దాదాపు పెండు దశాబ్దాలుగా నితీష్ కుమార్ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన పట్ల, ఆయన పాలన పట్ల తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని అంటున్నారు. అది ఎన్డీయే కూటమి విజయావకాశాలపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన ఎన్డీయే కూటమిలో వ్యక్తం అవుతోంది. సరే అది పక్కన పెడితే బీహార్ అసెంబ్లీలో 243 సీట్లకు గానూ పొత్తులో చిన్నా చితకా పార్టీలకు కేటాయించిన స్థానాలను మినహాయించి 205 స్థానాలలో చెరిసగంగా బీజేపీ, జేడీయూలు పోటీలోకి దిగాలని యోచిస్తున్నాయి. అయితే చిరాగ్ పశ్వాన్ మాత్రం తమ పార్టీకి కూటమి పొత్తులో భాగంగా ఇవ్వజూపిన పాతిక స్థానాలతో సంతృప్తి చెందడం లేదు.
మరో వైపు ఇండియా కూటమిలోనూ సీట్ల పంచాయతీ ఓ కొలిక్కి రావడం లేదు. .వామపక్ష ఎంఎల్ పార్టీ 30 సీట్లు డిమాండ్ చేస్తున్నది. అలాగే ఆర్జేడీ, కాంగ్రెస్ ల మధ్య కూడా సీట్ల పంపిణీలో పీటముడులు పడే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తతం ఉన్న పరిస్థితులను బట్టి అంచనా వేస్తే పీకే కింగ్ మేకర్ గా మారతారన్న అభిప్రాయమే పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది.