కేసీఆర్ లో జూబ్లీ గాభరా?
posted on Sep 22, 2025 @ 5:19PM
బీఆర్ఎస్ ను జూబ్లీ ఉప ఎన్నికలు గాభరా పెడుతున్నాయా? ఆ పార్టీ అధినేత కేసీఆర్ కవిత విషయంలో పునరాలోచిస్తున్నారా? అంటే పరిశీలకుల నుంచి ఔనన్నసమాధానమే వస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే నెల మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఈసీ రెడీ అయ్యింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు కూడా నోటిఫికేషన్ వెలువడుతుందని అంటున్నారు. దీంతో తమ సిట్టింగ్ సీటును ఎలాగైనా కైవశం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్ కు కవిత వ్యవహారం ఇబ్బంది పెడుతున్నది. జూబ్లీ ఉప ఎన్నికలో కవిత తెలంగాణ జాగృతి తరఫున అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు ఉండటంతో బీఆర్ఎస్ లో ఓటమి భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
అధికారంలో ఉన్నంత కాలం విపక్షాలను నానా ఇబ్బందులకూ గురి చేసి ఆ పార్టీల్లో చీలికలకు ప్రోత్సహించిన బీఆర్ఎస్.. ఇప్పుడు సొంత పార్టీలోనే అసమ్మతి, అసంతృప్తులు పెచ్చరిల్లడంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మరీ ముఖ్యంగా కవిత తిరుగుబావుటా ఆ పార్టీని ఊపిరితీసుకోలేనంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తెలంగాణ రాజకీయాలలో గత కొంత కాలంగా కల్వకుంట్ల కవిత హాట్ టాపిక్ అయిన సంగతి విదితమే. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అక్రమాలకు హరీష్ బాధ్యుడంటూ ఆమె చేసిన ఆరోపణలు, విమర్శలతో పార్టీ నుంచి సస్పెండయ్యారు. ఇప్పుడు ఆమెను సస్పెండ్ చేసి తప్పుచేశామా అన్న భావనలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సస్పెన్షన్ కు గురైన కవిత ఎక్కడా వెనక్కు తగ్గకుండా ముందుకు సాగడమే కాకుండా జూబ్లీ ఉప ఎన్నికలో తెలంగాణ జాగృతి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నేత అలీఖాన్ ను రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది.
అదే జరిగితే.. తమ ఓటమి ఖాయమన్న భయం బీఆర్ఎస్ లో వ్యక్తం అవుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అదే భావనకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నేడో, రేపో కేసీఆర్ కవితను తన ఫామ్ హౌస్ కు పిలిపించి మాట్లాడే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. ఆమెతో చర్చించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో జాగృతి అభ్యర్థిని నిలబెట్టకుండా బుజ్జగించే యోచనలో కేసీఆర్ ఉన్నారని ఆ వర్గాలు అంటున్నాయి. ఒక వేళ జూబ్లీ ఉప ఎన్నికలో కవిత కనుక జాగృతి అభ్యర్థిని నిలబెట్టడమంటూ జరిగితే బీఆర్ఎస్ ఓట్లు చీలి ఓటమి పాలవుతామన్న భయంతో పాటు అది అధికార పార్టీకి లాభం చేసే అవకాశం ఉంటుందన్న భావనతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కవితతో చర్చించడమే మేలన్న అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు.