ఓటమి దశగా మమతా! బెంగాల్ లో సంచలనం
posted on May 2, 2021 @ 11:37AM
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాదాపుగా నిజమవుతున్నాయి. మెజార్టీ ఎగ్టిట్ పోల్స్ సంస్థలు చెప్పినట్లే బెంగాల్ లో హ్యాట్రిక్ విజయం దిశగా తృణామూల్ కాంగ్రెస్ దూసుకుపోతోంది. తొలి ట్రెండ్స్ లో హోరాహోరీగా పోరు సాగినట్లు కనిపించినా.. రౌండ్లు సాగే కొద్ది టీఎంసీకి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న బెంగాల్ లో టీఎంసీ 190కి పైగా స్థానాల్లో లీడ్ లో ఉండగా.. బీజేపీ 90 స్థానాలకే పరిమితం అయ్యేలా కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148.
అయితే పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ మూడోసారి అధికారం దిశగా దూసుకుపోతున్నా.. సీఎం మమతా బెనర్జీకి మాత్రం షాక్ తప్పేలా లేదు. నందిగ్రామ్ మమతా బెనర్జీ వెనుకంజలో ఉన్నారు. టీఎంసీలో కీలక నేతగా ఉండి... బీజేపీలో చేరిన సువేందు అధికారి నందిగ్రామ్ లో విజయం దిశగా పయనిస్తున్నారు. నాలుగు రౌండ్లు ముగిసేసరికి సువేందు అధికారి.. మమతపై దాదాపు 8 వేలకు పైగా ఓట్ల లీడ్ లో ఉన్నారు. మొదటి రౌండ్ నుంచి మమత వెనుకంజలోనే ఉన్నారు. దీంతో నందిగ్రామ్ ఫలితం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆసక్తిగా మారింది. నందిగ్రామ్ లో ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం మమతా బెనర్జీ గెలవడం అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తమిళనాడులో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఇప్పటికే మేజిక్ ఫిగర్ ను దాటేసి ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీలో 118 మేజిక్ ఫిగర్ కాగా, డీఎంకే 160 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. డీఎంకే ఆధిక్యంలో కొనసాగుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలను ప్రారంభించాయి. అన్ని జిల్లాల కార్యాలయాలతో పాటు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద హడావుడి మొదలైంది.అసోంలో రెండోసారి అధికారం దిశగా బీజేపీ కనిపిస్తోంది. అసోంలో కమలదళానికి స్పష్టమైన మెజార్టీ కనిపిస్తోంది. కేరళలో గత సంప్రదాయానికి భిన్నంగా వరుసగా రెండోసారి లెఫ్ట్ కూటమి అధికారం కైవసం చేసుకోబోతోంది. పుదుచ్చేరిలో మాత్రం అన్నాడీఎంకే, బీజేపీ కూటమి గెలుపు దిశగా పయనిస్తోంది.