జూన్ లో ఈటల కొత్త పార్టీ! టీఆర్ఎస్ సీనియర్ల సపోర్ట్?
posted on May 2, 2021 @ 9:52AM
భూకబ్జా ఆరోపణలతో మంత్రి ఈటల రాజేందర్ ను వైద్యశాఖ నుంచి తప్పించారు సీఎం కేసీఆర్. ఆయనపై విచారణ జరుగుతుండగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. భూ ఆక్రమణలపై జిల్లా కలెక్టర్, విజిలెన్స్ నివేదిక వచ్చాకా ఆయనపై వేటు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తనపై జరుగుతున్న తతంగాన్ని గమనిస్తున్న ఈటల రాజేందర్.. నివేదికను చూశాకే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. తనకు మద్దతుగా వచ్చిన అనుచురలతో ఆయన చర్చలు కూడా జరిపారు. తనపై ప్లాన్ ప్రకారమే కుట్ర జరుగుతుందని ఆరోపిస్తున్న ఈటల... భవిష్యత్ కార్యాచరణపై దాదాపు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తెలంగాణలో కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ.. కొత్త పార్టీ పెట్టబోతున్నారని ఈటల సన్నిహితులు చెబుతున్నారు.
జూన్ లో ఈటల రాజేందర్ కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని ఖచ్చితంగా తెలుస్తోంది. తెలంగాణలో 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. చివరి ఏడాదంతా ఎన్నికలతో సరిపోతోంది. అందుకే జూన్ లో పార్టీ ప్రక్రియ మొదలు పెడితే.. రెండు,మూడు నెలలు అంతా సెట్ కావడానికి పోతోంది. దీంతో ఏడాది పాటు జనంలోకి వెళ్లేందుకు, ప్రజా పోరాటాలకు అవకాశం ఉంటుందని ఈటల భావిస్తున్నారు. అందుకే సాధ్యమైనంత త్వరగా... ఈ జూన్ లోనే పార్టీ పెట్టాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈటల పార్టీ పెడితే మద్దతు ఇచ్చేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా ఉన్న నేతలంతా ఈటలతో టచ్ లో ఉన్నారని అంటున్నారు. టీఆర్ఎస్ లోని అసమ్మతి నేతలతో పాటు కాంగ్రెస్, బీజేపీలోని కొందరు నేతలు కూడా రాజేందర్ తో కలిసి నవడవచ్చని అంచనా వేస్తున్నారు. బీసీ నేతగా రాజకీయంగా ఎదిగిన ఈటలకు మద్దతుగా బీసీ నేతలు, సంఘాలు కలిసివచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
నిజానికి భూకబ్జాలు చేశానంటూ కేసీఆర్ అనుకూల మీడియాలో తనపై వార్తలు రావడంతోనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఈటల డిసైడయ్యారట. రాజీనామా లేఖను సిద్దం చేసుకుని మీడియా సమావేశానికి సిద్దమయ్యారట. అయితే ఆయన సన్నిహితులతో పాటు కొందరు టీఆర్ఎస్ నేతలు రాజీనామా వద్దని ఆయనను వారించారని చెబుతున్నారు. కొందరు మంత్రులు కూడా ఈటలతో మాట్లాడారని.. రాజీనామా చేస్తే తప్పు అంగీకరించినట్లు అవుతుందని, ముఖ్యమంత్రి ఏం చేస్తారో చూశాక నిర్ణయం తీసుకోవాలని సూచించారట. అలా చేస్తే జనాల్లో సింపతి మరింత వస్తుందని చెప్పారట. అందుకే శుక్రవారం రాత్రి రాజేందర్ ప్రెస్ మీట్ ఆలస్యం అయిందంటున్నారు. అయితే వైద్యశాఖను తప్పిస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడంతో.. తన భవిష్యత్ కార్యాచరణపై ఈటల నిర్ణయం తీసుకున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉంది. అదే సమయంలో విపక్షాలపై కూడా జనాల్లో నమ్మకం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే కొత్త పార్టీ అవసరమనే అభిప్రాయం ఉంది. పొలిటికల్ స్పేస్ ను క్యాష్ చేసుకునేందుకు కొందరు నేతలు కొత్త పార్టీ ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశర్ రెడ్డి కూడా కొత్త పార్టీ యోచనలో ఉన్నట్లు చెప్పారు. అయితే పక్కా బ్యూరోక్రాట్ అయిన కొండా.. పార్టీని నడపలేరనే అభిప్రాయం బయటికి వచ్చింది. అందుకే అతనితో ఎవరూ టచ్ లోకి వెళ్లలేదంటున్నారు. ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసు సమస్యగా ఉంది. రేవంత్ పార్టీ పెడితే... ఆ కేసుతో సర్కార్ ఇబ్బంది పెడుతుందనే చర్చ జరిగింది. తాజాగా ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న సత్తుప్లలి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని లీకులు వస్తున్నాయి. అదే జరిగితే సండ్రతో కలిసి రేవంత్ ను మరింత ఇబ్బంది పెట్టే అవకాశం సీఎంకు ఉంటుంది. అందుకే రేవంత్ పార్టీ వైపు లీడర్లు ఎక్కువగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
ఈటల రాజేందర్ విషయానికి వస్తే.. రాజకీయాల్లో ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉంది. తెలంగాణ ఉద్యమంలో ముందున్నారు. టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ టూగా ఉద్యమాన్ని నడిపించారు. టీఆర్ఎసిఎల్పీ నేతగా, మంత్రిగా ఆయనకు సుదీర్ఘ అనుభవంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ ఉంది. అంతేకాదు బీసీ నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. తెలంగాణ ఉద్యమకారుల మద్దతు ఉంది. ముఖ్యంగా ప్రజలతో మమేకం అవుతారనే పేరు ఉంది. ఇవన్ని అనుకూలతలు ఉన్నాయి కాబట్టే.. కొత్త పార్టీతో ఈటల సక్సెస్ అవుతారనే టాక్ వస్తోంది. కోదండరామ్ లాంటి ఉద్యమ నేతలంతా ఈటలతో కలిసి నడిచే అవకాశం ఉంది.
భూకబ్జా ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రి ఈటల రాజేందర్‌కు టీజేఎస్ అధినేత, ప్రొఫెసర్ కోదండరాం ఓపెన్ గానే మద్దతు తెలిపారు. కేసీఆర్‌ను గద్దె దింపటానికి ఉద్యమకారులు ఏకం కావాల్సిన సమయయం వచ్చిందని పిలుపునిచ్చారు. ఉద్యమకారులు విడి విడిగా ఉండటం వలనే కేసీఆర్ రెచ్చిపోతున్నాడని విమర్శించారు.
మరోవైపు పక్కా స్కెచ్‌తోనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఈటల ఆరోపిస్తున్నారు. కట్టు కథలతో తన క్యారెక్టర్‌ని పాడుచేసే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.ఎవరి చరిత్ర ఏమిటో తనకు తెలుసు అని.. కానీ వాటిని విప్పాలనుకోవడం లేదని అన్నారు. సమయం వచ్చినప్పుడు అందరి బండారం బయటపెడతానని చెప్పారు. దీంతో ఈటల ఎవరి చరిత్ర బయటికి తీస్తారోనన్న ఆందోళన గులాబీ లీడర్లలో కనిపిస్తోంది. 2004 నుంచి ఉద్యమంలో, 2014 నుంటి ప్రభుత్వంలో ఉన్న ఈటలకు...టీఆర్ఎస్ పార్టీ నేతల చరిత్ర అంతా తెలుసంటున్నారు. అందుకే ఈటల ఏం చేయబోతున్నారని, ఎవరిపై బాంబ్ పేల్చబోతున్నారనే టెన్షన్ అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోంది. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు జరగబోతున్నాయని, ఈటల కొత్త పార్టీ పెట్టడం ఖాయమని చెబుతున్నారు. రాజకీయ వ్యూహాల్లో దిట్టగా పేరున్న కేసీఆర్ కు కౌంట్ డౌన్ మొదలైందనే చర్చ కూడా జనాల్లో జరుగుతోంది.