గాంధీ జయంతి నిజమైన పండగ
posted on Oct 2, 2012 @ 10:11AM
ఒంటిమీద కొల్లాయిగుడ్డ.. చేతిలో భగవద్గీత.. పెదాలపై నిరంతరం చెరగని చిరునవ్వు.. అంతులేని శాంతి, సహనం.. సత్యం ఆయన జీవన మార్గం.. అహింస ఆయన ఎన్నుకున్న పదునైన ఆయుధం.. ఏళ్లపాటు భరతజాతిని దాస్యసృంఖలాలతో బంధించిన తెల్లోళ్లని ఓ బోసి నవ్వుల తాతయ్య దేశంనుంచి తరిమికొట్టాడు.. అదీ.. ఆ శాంతిమూర్తి గొప్పదనం.. తను నమ్మిన సిద్ధాంతాల్ని ఆచరించి చూపించి మరీ గాంధీ తాత జాతిపిత అయ్యాడు. తరతరాలకూ ఆదర్శంగా నిలిచిపోయాడు. జాతి దురహంకారాన్ని సమూలంగా ఏరిపారేసేందుకు కంకణం కట్టుకున్న మహాత్ముడు సత్యాగ్రహాలతోనే తెల్లవాళ్లగుండెల్లో గుబులు పట్టించాడు. సత్యానికి అఖండమైన, అనంతమైన శక్తి ఉందన్న సత్యాన్ని ప్రపంచానికి చాటి చూపించాడు. మహాత్ముడి జీవితం ఆద్యంతమూ ఆదర్శప్రాయమే. కోట్లాది రూపాయల్ని కురిపించగల బారిస్టరీని వదిలేసి దేశం కోసం తన సర్వస్వాన్నీ త్యాగం చేశాడు. దేశమాతకు తన జీవితాన్ని కానుకగా ఇచ్చాడు. జాతి దాస్యసృంఖలాల్ని ఛేదించేందుకు నిరంతరం తపించాడు. ఆవేశకావేశాలకు లోనయ్యే యువరక్తాన్ని సన్మార్గంలోకి మళ్లించాడు. జాతిమొత్తం మహాత్ముడి వెంట నడిచొచ్చింది. స్వాతంత్ర్య పోరాటంలో సబర్మతీ ఆశ్రమం పరమపావన క్షేత్రమయ్యింది. చిన్నాపెద్దా తేడా లేదు.. బీదాగొప్పా భేదం లేదు. మహాత్ముడి పిలుపుని అందుకున్న కోట్లాదిమంది భారతీయులు కదనరంగంలోకి దూకారు. సత్యాగ్రహాలతో శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. తెల్లోళ్లు ఓ చెంప పగలగొడితే మరో చెంపచూపించారు. లాఠీలతో చావగొడితే వందేమాతరమంటూ నినదించారు తప్ప తిరగబడి మళ్లీ వాళ్లని చావగొట్టలేదు. శరీరం రక్తమోడుతున్నా శాంతంగా ఉండగల శక్తిని స్వాంతంత్ర్య పోరాటయోధులకు బోసి నవ్వుల తాతయ్యే అందించాడు. ప్రాణాలు పోతున్నా హింసకు పాల్పడకూడదన్న ధృడ నిశ్చయాన్ని
స్వాతంత్ర సమరయోధులకు వరంగా ఇచ్చాడు మహాత్ముడు. అందుకే ఆయన చూపించిన శాంతంలోంచే అంఖడమైన శక్తి జ్వాల పుట్టింది. ఆయన నమ్ముకున్న సత్యం లోంచి విజయం నడిచొచ్చింది. ఇప్పటికీ, ఎప్పటికీ జాతికి మహాత్ముడి శాంతి తత్వం తిరుగులేని శక్తిగా జాతిని నడిపిస్తోంది. అందుకే మహాత్మా గాంధీ పుట్టిన రోజు నిజంగా భారతీయులందరికీ పెద్ద పండగ.