మాగంటి సునీతకు సవతి పోరు!?
posted on Oct 23, 2025 @ 10:14AM
మొన్నటి వరకూ అందరూ సునీత మాత్రమే మాగంటి గోపీనాథ భార్య. ఆమె పిల్లలు మాత్రమే ఆయనకు వారసులు. ఇదొక చిన్న కుటుంబం చింతలేని కుటుంబం. అనుకుంటున్నారంతా. ఇంతలో సడెన్ ఎంట్రీ ఇచ్చాడు తారక్ ప్రద్యుమ్న. తానే అసలైన వారసుడిననీ, తనకు చట్టరీత్యా రావల్సిన ఈ హక్కు తన తండ్రితో లివిన్ రిలేషన్లో ఉన్న సునీతకు ఎలా ఇచ్చారంటూ.. ఈసీకీ ఫిర్యాదు చేయడంతో ఇంటి గుట్టు- రాజకీయం రట్టుగా మారింది.
సునీతకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందే సెంటిమెంటు ద్వారా నాలుగు ఓట్లు పడతాయని. ఇపుడీ మొదటి భార్య కొడుకు కారణంగా బీఆర్ఎస్ ఆశలపై భారీగా నీళ్లు జల్లినట్టయ్యింది. అయితే మాగంటి గోపీనాథ్ చనిపోయినపుడు తలకొరివి పెట్టడానికి కానీ, ఆ తర్వాత ఆయన నివాళి సభలకు కానీ రాని తారక్ ప్రద్యుమ్న సడెన్ గా తాను గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి కొడుకును, ఆయన అసలు సిసలు రాజకీయ వారసుడ్నిఅంటూ రావడంతో అంతా ఉలిక్కి పడ్డారు. సునీత తప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్ చూపించి గోపీనాథ్ భార్యగా నిరూపించే యత్నం చేశారు. అక్టోబర్ 11న ఆ సర్టిఫికేట్ ని ఆర్డీఓ ఆఫీసు వారు కూడా రద్దు చేశారంటూ నానా యాగీ చేస్తున్న ఇతడిచ్చిన కంప్లయింట్ పై సునీత ఈసీకి వివరణ ఇస్తారు. అంతా బావుంది. మరి ఇప్పుడే ఇతడెందుకిలా బయటకొచ్చినట్టు? ఇతడి వెనక ఎవరున్నట్టు? అన్న ప్రశ్నకు ఆస్కారమేర్పడుతోంది.
అయితే ఇతడు మాగంటి ఇంటి పేరును కూడా తన పేరు చివర వాడటం లేదనీ.. కొసరాజు తారక్ ప్రద్యుమ్న అనే పేరుతో చెలామణీ అవుతున్నాడనీ.. తండ్రి చివరి సారి చూపులకు కూడా రాని ఇతడు.. ఇప్పుడే సడెన్ గా ఊడి పడ్డం వెనక కాంగ్రెస్ మార్క్ రాజకీయ కుట్ర కోణం ఉందనీ.. అంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు. అయితే ఇప్పుడు సునీత మాగంటి గోపీనాథ్ భార్య అవునా కాదా? లివిన్ లో మాత్రమే ఉన్న జీవిత భాగస్వామా?
వంటివి పెద్దగా అడ్డంకులు కావు. ఎందుకంటే ఈ దిశగా చట్టాలు మారి చాలా కాలమే అయ్యింది. ఎలిజిబిటిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని బట్టిచూస్తే ఆడ, మగ తేడా లేకుండా ఎవరు ఎవరితోనైనా ఉండొచ్చు. సంచరించొచ్చు. సహజీవన భాగస్వామ్యం కొనసాగించవచ్చు. అయితే సునీత తప్పుడు ధృవీకరణ పత్రాలే అసలు సమస్య. ఇప్పటికే సునీత నామినేషన్ల సెట్ ఓకే చేసీన ఈసీ ఈ ఫిర్యాదు ద్వారా ఎలాంటి నిర్ణయం తీస్కుంటారన్న సస్పెన్స్ నడుస్తోంది.