హస్తినకు లోకేష్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలో రాష్ట్ర ఎంపీలకు మార్గదర్శనం?
posted on Sep 8, 2025 @ 12:29PM
లోకేష్ ప్రాధాన్యత ఇటు రాష్ట్రంలో.. అటు కేంద్రంలో రోజురోజుకూ పెరిగుతున్నది. ఇక ఇప్పుడు కేంద్రంలో లోకేష్ చక్రం తిప్పడానికి స్వయంగా చంద్రబాబే ఆమోదం తెలిపేశారు. తన స్థానంలో లోకేష్ ను ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం ఎంపీలకు మార్గదర్శనం చేసి, వారు ఎన్డీయూ కూటమి అభ్యర్థికే ఓటు వేసేలా పర్యవేక్షణ చేయడానికి లోకేష్ ను హస్తినకు పంపుతున్నారు. లోకేష్ ఢిల్లీలో సోమవారం (సెప్టెంబర్ 8) సాయంత్రం తెలుగుదేశం, జనసేన ఎంపీలతో భేటీ అవుతారు. వారంతా ఎన్డీయే అభ్యర్థికే ఓటు వేసేలా పర్యవేక్షించడంతో పాటు వారికి అందుకు అనుగుణంగా శిక్షణ కూడా ఇస్తారు.
పర్యవేక్షణ, శిక్షణ ఎందుకంటే.. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసే విధానం ఒకింత భిన్నంగా ఉంటుంది. అందుకే తెలుగుదేశం, జనసేన ఎంపీలకు ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటువేసే విధానంపై అవగాహన కల్పించడంతో పాటు, శిక్షణ కూడా ఇవ్వాలన్న చంద్రబాబు సూచన మేరకు లోకేష్ ఆ బాధ్యతన భుజస్కంధాలపై వేసుకున్నారు. ఇక సోమవారం (సెప్టెంబర్ 8) రాత్రి హస్తినలోనే బస చేసి.. మంగళవారం (సెప్టెంబర్ 9) ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తారు.
ఈ మేరకు తెలుగుదేశంపార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు టీడీపీ ఎంపీలకు సమాచారం ఇచ్చారు. వాస్తవానికి సీఎం చంద్రబాబే స్వయంగా ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అయితే బుధవారం ( సెప్టెంబర్ 10) అనంతపురంలో నిర్వహించే సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో పాల్గొనాల్సిన నేపథ్యంలో చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని బదులుగా నారా లోకేష్‌ను పంపిస్తున్నారు.