సీబీఎన్ కేబినెట్ పై లోకేష్ ముద్ర!?
posted on Jun 13, 2024 @ 10:58AM
చంద్రబాబునాయుడి కేబినెట్ పాత కొత్తల మేలుకలయికగా సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నది. అయితే పలువురు సీనియర్లకు ఆయన కేబినెట్ లో స్థానం దక్కకపోవడంపై కూడా విస్తృత చర్చ జరుగుతోంది. అదే సమయంలో చంద్రబాబు కేబినెట్ పై లోకేష్ ముద్ర విస్పష్టంగా కనిపిస్తోందని పార్టీ వర్గాలు, రాజకీయవర్గాలు కూడా భావిస్తున్నాయి.
ఒక సందర్భంగా పార్టీ కోసం పని చేయడానికి కేబినెట్ లో స్థానం వద్దని చెప్పడానికి కూడా వెనుకాడనని లోకేష్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. సీనియర్లు ఇంత వరకూ పదవులు అనుభవించారు. ఇక నుంచి పార్టీ కోసం పని చేయాలని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పలు సందర్భాలలో లోకేష్ చెప్పిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు చంద్రబాబు తన కేబినెట్ లో యువతకు పెద్ద పీట వేయడం ద్వారా సీనియర్లకు పార్టీ పనులు అప్పగించడం ఖాయమన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. పార్టీ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా యువతను ప్రొత్సహించేందుకు, తద్వారా లోకేష్ తిరుగులేని నాయకుడిగా ఎదిగేందుకు మార్గం సుగమం చేయడంలో భాగంగానే ఆయన కొత్త కేబినెట్ కూర్పు ఉందన్న భావన వ్యక్తం అవుతోంది. పైగా అసెంబ్లీలో ప్రతిపక్షం అనేదే లేకుండా పోయిన ఈ సందర్భం కంటే కొత్త వారికి అవకాశాలచ్చి ప్రయోగాలు చేయడానికి ఇంతకు మించిన వెసులుబాటు ఉండదని కూడా చంద్రబాబు భావించినట్లు చెబుతున్నారు.
కొత్త మంత్రులు తమ సత్తా చాటడానికి, పని తీరును రుజువు చేసుకోవడానికి మంచి అవకాశంగా కూడా అభివర్ణిస్తున్నారు. సభలో విపక్షం లేని ఈ పరిస్థితిలో పాతవారికి అవకాశాలు ఇవ్వడం కంటే కొత్తవారికి పెద్ద పీట వేయడం ద్వారా భవిష్యత్ లో వారు పార్టీకి గట్టి అండగా నిలిచే అవకాశం ఉంటుందని అంటున్నారు. తెలుగుదేశం ఆవిర్భావం సమయంలో ఎన్టీఆర్ యువతకు విరివిగా అవకాశాలు ఇవ్వబట్టే నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరకుండా నిలబడిందని ఉదహరిస్తున్నారు.
అదే సమయంలో సీనియర్ల అనుభవాన్ని పార్టీ పటిష్టతకు మరింత బలోపేతం చేయడానికి ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని విస్మరించకూడాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు కేబినెట్ పై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ముద్ర ప్రస్ఫుటంగా కనిపిస్తోందని తెలుగుదేశం నాయకులే అంటున్నారు.