అతి త్వరలో జగన్ నోట ‘జై అమరావతి’!
posted on Jun 13, 2024 @ 11:07AM
‘జై అమరావతి’... ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఒకే తాటిమీద నడిపించిన నినాదం.. ‘జై అమరావతి’... ప్రపంచంలోనే అద్భుత రాజధాని కోసం ఆంధ్రజాతి చేసిన నినాదం... ‘జై అమరావతి’... మహోన్నతమైన రాజధాని కోసం 33 వేల ఎకరాల భూములను ఇచ్చిన రైతులు చేసిన నినాదం... ‘జై అమరావతి’... ఆంధ్రుల స్వప్నాన్ని దుష్టశక్తులు కాలరాయడానికి ప్రయత్నించినప్పుడు ఆంధ్రజాతి యావత్తూ ఒక్కటై చేసిన నినాదం.. ఆ దుష్టశక్తులను తరిమికొట్టిన నినాదం. ఈ నినాదం.. అద్భుతమైన ఈ నినాదం.. త్వరలో ఒక గొంతులో వినబోతున్నాం.. ఆ గొంతు ఎవరిదో కాదు.. వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిది.
అధికారం చేపట్టినప్పటి నుంచి బిడ్డను పొదిగే గర్భంలో గొడ్డలి దించే కర్కశత్వాన్ని ప్రదర్శించి, అమరావతిని ఆదిలోనే అంతం చేయడానికి భారీ స్థాయిలో కుట్ర చేసి, మూడు రాజధానులు అంటూ కొత్త వాదన తెరమీదకి తెచ్చి, అమరావతిని విజయవంతంగా ఘోస్ట్ సిటీగా మార్చిన జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ‘జై అమరావతి’ అనే మాట రాబోతోంది అని చెబితే ఎవరికీ నమ్మశక్యం కాదు.. కానీ, ఇది నిజం... త్వరలో జరగబోతున్న వాస్తవం. ఆంధ్రజాతి భవిష్యత్తుని కాపాడుకోవడం కోసం ‘జై అమరావతి’ అనే ఉద్యమం ఐదేళ్ళుగా సాగింది. ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తుని కాపాడుకోవడం కోసం జగన్ త్వరలో ‘జై అమరావతి’ అని అనబోతున్నారు.
తిరుగులేని ఓటమికి గురైన తర్వాత రెండు మూడు రోజులు స్తబ్దుగా వున్న జగన్మోహన్‌రెడ్డి మళ్ళీ తన మార్కు రాజకీయాలను ప్రదర్శించడం ప్రారంభించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతి రాజధానిగా స్థిరపడిపోవడం అనివార్యం. కూటమి అధికారంలో వుండే ఈ ఐదేళ్ళ కాలంలో అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందడం ఖాయం. ఐదేళ్ళ తర్వాత తాను పొరపాటున అధికారంలోకి వచ్చినా మూడు రాజధానులు, ముప్ఫై మూడు రాజధానులు అనడానికి అవకాశం వుండదు. అందుకని, అమరావతిని రాజధానిగా ఒప్పుకోవడానికి మానసికంగా సిద్ధం అయ్యారు. ఆయన మానసికంగా సిద్ధం అయిన తర్వాత, తన సొంత మీడియాని మానసికంగా సిద్ధం చేశారు. అందుకే, ఆయన మీడియాలో ఇప్పుడు అమరావతి మీద అనుకూల కథనాలు వస్తున్నాయి. ‘‘మూడు రాజధానుల సంగతి అలా వుంచితే, ఇప్పుడు అమరావతి రాజధానిని సక్రమంగా నిర్మించేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి.. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరిగేలా చూడాలి’’ అని జగన్ అనుకూల మీడియా సన్నాయి నొక్కులు నొక్కుతోంది.
జస్ట్ ఇంకొక వారం పది రో్జుల లోపలే జగన్ ‘‘అమరావతి రాజధానిగా వుండటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’’ అంటూ ప్రకటన విడుదల చేసే అవకాశాలు వున్నట్టు సమాచారం. జగన్ ప్రస్తుతం నివాసం వుంటున్నది అమరావతి ప్రాంతంలోనే. జగన్ నో అన్నా, అరిచి గీ పెట్టినా అమరావతి నిర్మాణం ఆగేది కాదు.. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతికి వ్యతిరేకంగా వుండటం కంటే, ‘జై అమరావతి’ అంటే ఒక పనైపోతుందని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అమరావతికి అనుకూలంగా మాట్లాడి, భవిష్యత్తులో అమరావతికి సంబంధించిన అన్ని అంశాల్లోకీ దూరిపోయి ఉద్యమాలు చేయడానికి అర్హత సంపాదించుకోవాలన్నది జగన్ వ్యూహం.
జగన్ వ్యూహం జగన్‌కి వుంటే, ప్రజల వ్యూహం ప్రజలకి వుంది. 2019 ఎన్నికల ముందు అమరావతికి జై కొట్టి, అధికారంలోకి రాగానే అమరావతి రైతుల నోట మట్టి కొట్టిన విషయాన్ని ఎవరూ మరచిపోలేరు. ఇప్పుడు జగన్ జై అమరావతి అన్నంత మాత్రాన జనం మురిసిపోయి జగన్ మారిపోయాడని నమ్మరు. చివరికి ప్రభుత్వం ఇస్తానని చెప్పిన కౌలు కూడా ఇవ్వకుండా రైతులను హింసించిన జగన్‌ని ప్రజలు ఎంతమాత్రం నమ్మరు. తాను జై అమరావతి అన్నప్పటికీ, జనం తనని నమ్మరని తెలిసినా, ఈ విషయంలో జగన్ వెనుకడుగు వేయరు.. తాను అనుకున్నది తాను చేస్తారు. ఎందుకంటే, ఆయన కరడుగట్టిన రాజకీయ రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి.