బాధ్యత వద్దు..విమర్శలే ముద్దు.. జగన్ పై లోకేష్ ఫైర్
posted on Oct 29, 2025 @ 5:02PM
మొంథా తుఫాను.. పలు ప్రభావిత జిల్లాల ప్రజలకు కంటిపై కునుకులేకుండా చేసింది. ఏ క్షణంలో ఏ ఉపద్రవం ముంచుకు వస్తుందో అన్న ఆందోళనలో క్షణమొక యుగంగా గడిపారు. కానీ వారిని మించి.. ప్రజలకు ఎటువంటి కష్టం, ఇబ్బందీ లేకుండా తుపాను గండం గడిచేలా చేయడానికి ముఖ్యమం్తరి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆ రెండు రోజులూ కంటిమీద కునుకు సంగతి పక్కన పెడితే రెప్ప కూడా వాల్చకుండా అప్రమత్తంగా ఉన్నారు. నిరంతర సమీక్షలతో, ఆర్టీజీఎస్ నుంచి క్షణం క్షణం అధికారులకు దిశానిర్దేశం చేస్తూ, అవసరమైన ఆదేశాలు జారీ చేస్తూ, వాతావరణ కేంద్రం నుంచి వచ్చే సంకేతాలను, సందేశాలను పరిశీలిస్తూ గడిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకధాటిగా 12 గంటల పాటు ఆర్టీజీఎస్ లోనే తిష్ఠవేసి పరిస్థితిని క్షణక్షణం పర్యవేక్షించారు.
ఇలా అనుక్షణం ప్రజల క్షేమం కోసం, తుపాను నష్టాన్ని కనిష్ఠస్థాయికి తగ్గించడం కోసం తపనపడ్డారు. తుపాను తీరం దాటిన తరువాత నష్టం అత్యంత తక్కువగా ఉండటంతో ఆయన శ్రమ ఫలించింది. అయినా ఆయన క్షణం తీరిక చేసుకోలేదు. వెంటనే అంటు బుధవారం (అక్టోబర్ 29) తుపాను ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏరియల్ సర్వేకు బయలుదేరడానికి ముందు ప్రభావిత ప్రాంతాల అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి.. సహాయ, పునరావాస కార్యక్రమాలను స్పీడప్ చేయాలన్న ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన సూచనలు చేశారు.
అయితే.. ప్రజలు కష్టాలలో ఉన్న సమయంలో ఏ నాయకుడైనా సరే.. అధికారంలో ఉన్నా, లేకున్నా బయటకు వచ్చి ప్రజలకు సహాయ హస్తం అందించాలి. ఇది కనీస బాధ్యత. అలా బయటకు వచ్చేందుకు మనస్కరించకుండా నోరు మెదపకుండా.. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు, బాధితులను ఆదుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను చూస్తూ సైలంట్ గా ఉండాలి. కానీ వైసీపీ ఎకో సిస్టమే వేరు. ఆ పార్టీ తాను చేయదు.. మరొకరు చేస్తుంటే ఓర్వదు. మొంథా తుపానును ఎదుర్కోవడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం శక్తివంచన లేకుండా సర్వశక్తులూ ఒడ్డి ప్రజలకు ఎటువంటి కష్టం కలగకుండా అన్ని చర్యలూ తీసుకుంటుంటే.. వైసీపీయులు మాత్రం సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేస్తూ వికృతానందం పొందుతున్నారు. ఇదే విషయాన్ని మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఎత్తి చూపించారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ఆయన సంక్షోభ సమయంలో కరుణ ఉన్న నాయకుడెవరైనా సరే ప్రజలకు సాయం అందించడానికి ముందుకు వస్తారనీ, అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం బెంగళూరు ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకుంటూ.. తన మీడియా నెట్ వర్క్ ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. అటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. తమది ప్రజల ప్రభుత్వమని పేర్కొన్న లోకేష్ మొంథా తుపాను కారణంగా ప్రజలు ఎటువంటి కష్టనష్టాలూ ఎదుర్కోకుండా సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందన్నారు. ఆ చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయన్నారు.
ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేస్తున్న జగన్.. మాత్రం ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కనీసం తాడేపల్లికి కూడా రాకుండా బెంగళూరులో విశ్రాంతి తీసుకుంటూ అబద్ధాల ప్రచారానికి పాల్పడు తున్నారని విమర్శించారు. కష్టసమయంలో ప్రజలకు అండగా నిలవడానికి బదులుగా బెంగళూరులో రెస్ట్ తీసుకోవడాన్నే జగన్ ఎంచుకున్నారని లోకేష్ విమర్శించారు.