మోగిన సార్వత్రిక ఎన్నికల నగారా: 9 దశల్లో పోలింగ్
posted on Mar 5, 2014 @ 1:55PM
16వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎస్.సంపత్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం తొమ్మిది దశల్లో ఎన్నికలు జరుగనున్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 7 నుంచి తొలిదశ ఎన్నికలు ప్రారంభం కాగా, మే 7న తొమ్మిదవ దశతో ఎన్నికలు పూర్తికానున్నాయి. మే 16న ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా సంపత్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. పరీక్షలు, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల షెడ్యూల్‌ను రూపొందించామని సంపత్ పేర్కొన్నారు.
జనవరిలో ఓట్ల జాబితాను సవరించామని, దేశంలో మొత్తం 81.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు సంపత్ వెల్లడించారు. పేర్లు గల్లంతయిన ఓటర్ల కోసం మరో అవకాశం కల్పిస్తున్నామని ఆయన ప్రకటించారు. మార్చి 9న అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు నమోదు ప్రక్రియ నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా 9.30 లక్షల పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈసారి తిరస్కరణ ఓటు(నోటా) అమలులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
ఎన్నికల ముఖ్య తేదీలు :
ఏప్రిల్ 7న తొలిదశలో రెండు రాష్ట్రాల్లోని 6 లోక్‌సభ స్థానాలకు పోలింగ్
- ఏప్రిల్ 9న రెండో దశలో 5 రాష్ట్రాల్లోని 7 లోక్‌సభ స్థానాలకు పోలింగ్
- ఏప్రిల్ 10న మూడో దశలో 14 రాష్ట్రాల్లోని 92 లోక్‌సభ స్థానాలకు పోలింగ్
- ఏప్రిల్ 12 న నాలుగో దశలో మూడు రాష్ట్రాలోని 5 లోక్‌సభ స్థానాలకు పోలింగ్
- ఏప్రిల్ 17న ఐదో దశలో 13 రాష్ట్రాల్లోని 122 లోక్‌సభ స్థానాలకు పోలింగ్
- ఏప్రిల్ 24న ఆరో దశలో 12 రాష్ట్రాల్లోని 117 లోక్‌సభ స్థానాలకు పోలింగ్
- ఏప్రిల్ 30న ఏడో దశలో 9 రాష్ట్రాల్లోని 89 లోక్‌సభ స్థానాలకు పోలింగ్
- మే 7న ఎనిమిదవ దశలో 7 రాష్ట్రాల్లోని 64లోక్‌సభ స్థానాలకు పోలింగ్
- మే 12న తొమ్మిదవ దశలో 3 రాష్ట్రాల్లోని 41 లోక్‌సభ స్థానాలకు పోలింగ్
- మే 16న దేశవ్యాప్తంగా ఎన్నికల కౌటింగ్, అదేరోజు ఫలితాలు విడుదల.