ఏ రోటి కాడ ఆ పాట పాడుతున్న జైరాం
posted on Mar 5, 2014 @ 2:19PM
గ్రామాలలో మహిళలు వడ్లు దంచే రోటి దగ్గర ఒక రకం పాటలు పాడుతారు. మిరపకాయలు దంచేటపుడు మరొక రకం పాటలు పాడుతుంటారు. అందుకే ‘ఏ రోటి కాడ ఆ పాట’ అనే సామత పుట్టుకొచ్చింది. పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదం పొందగానే డిల్లీ నుండి రెక్కలు కట్టుకొని సీమాంధ్రపై వాలిపోయిన బీజేపీ నేత వెంకయ్య నాయుడిని చూసి కంగారుపడిన కాంగ్రెస్ అధిష్టానం, చూసి రమ్మంటే కాల్చి రాగల సమర్దుడయిన జైరాం రమేష్ ను రాష్ట్రం మొత్తం కవర్ చేసుకురమ్మని పురమాయించడంతో అయన మొదట తిరుపతి వెంకన్నకు మొక్కి అక్కడి నుండి నేరుగా హైదరాబాద్ లో వాలిపోయి, సోనియమ్మ అమ్మజెప్పిన ఘనకార్యం మొదలుపెట్టేసారు.
తెరాసని చెడామడా తిట్టేసి, ఆ పార్టీ ఇక ఎందుకు పనికిరాదని, అదొక శుద్ధ వేస్ట్ పార్టీ అని, తనకసలు రాష్ట్ర విభజనే ఇష్టం లేదని కానీ పార్టీ నిర్ణయాన్ని, తెలంగాణా ప్రజల ఆకాంక్షను మనసులో ఉంచుకొని విభజన ప్రక్రియలో పాలుపంచుకోవలసి వచ్చిందని సీమాంధ్ర ప్రజలకు వినబడేలా బిగ్గరగా అరిచి చెప్పారు. అప్పుడు తెరాస నేతలు కూడా ఆయనపై తీవ్రంగా విరుచుకు పడటంతో నిజంగానే ఆ రెండు పార్టీలు శత్రువులయిపోయాయేమో? అని అందరూ భ్రమ పడిపోయారు కూడా.
సీమాంధ్రలో వాతావరణం కొంచెం చల్లబడినట్లు వైజాగ్ కాంగ్రెస్ వాతావరణ శాఖ నుండి సిగ్నల్స్ రాగానే జైరాం రమేష్ మెటికలు విరుచుకొంటూ వైజాగ్ లో వాలిపోయి, కాంగ్రెస్ పార్టీ గత అరవై సం.లుగా దేశం మొత్తం మీద చేయలేని ఘన కార్యాలన్నిటినీ రానున్న పదేళ్లలో ఒక్క సీమాంధ్రకే చేసిపెట్టేందుకు కమిట్ అయిపోయిందని, కాంగ్రెస్ ఒకసారి కమిట్ అయితే తన మాట తనే వినదని, అందుకు తెలంగాణా ఏర్పాటే గొప్ప ఉదాహరణ అని, అందువల్ల ఇక సీమాంధ్ర ప్రజలందరూ కళ్ళు మూసుకొని (గుడ్డిగా) కాంగ్రెస్ పార్టీకి తమ ఓట్లు గుద్దేసి, తమ పిలకలు హస్తం చేతిలో నిరభ్యంతరంగా పెట్టేయోచ్చని నూరిపోసారు. ఇదంతా చూసి సీమాంధ్ర ప్రజలు ‘పాపం! జైరాంను, కాంగ్రెస్ పార్టీని అనవసరంగా అపార్ధం చేసుకోన్నామేమో? అని చాలా ఫీలయిపోయారు కూడా.
కానీ, ఆయన ఈరోజు వరంగల్ వెళ్ళగానే సరికొత్త ట్యూన్స్ తో సరికొత్త రోటిపాట అందుకొన్నారు. హైదరాబాద్ పూర్తిగా తెలంగాణా వాళ్ళకే చెందుతుందని, దానిలో వచ్చే ఆదాయంలో చిల్లి గవ్వ కూడా సీమాంధ్రకు విదిలించడం అనవసరమని తేల్చి చెప్పారు. అంతే కాక సీమాంధ్రవాళ్ళ మాట విని ఉంటే, చార్మినార్ లో రెండు మినార్లు కూడా తమ వాటాగా ఇవ్వమని డిమాండ్ చేస్తారని జోకేసారు. ఇక తెరాస కాంగ్రెస్ పార్టీలో విలీనం కాపోయినా తమ మధ్య ఎటువంటి అభిప్రాయభేదాలు లేవని, రెండు పార్టీల మధ్య దూరం పెరిగిందనడం వాస్తవం కాదని, తెరాస తమతో ఎన్నికల పొత్తులు పెట్టుకొనేందుకు అంగీకరిస్తే స్వాగతిస్తామని చెప్పి, తెరాసని మళ్ళీ మెయిన్ లైన్లోకి తీసుకు వచ్చారు.
అదే సమయంలో డిల్లీ నుండి దిగ్విజయ్ సింగ్ కూడా ఆయనకు కోరస్ పాడటం విశేషం. అంటే ఈ సాంగ్స్ అన్నీ డిల్లీలోనే ముందే కంపోస్ అయినట్లు అర్ధమవుతోంది. త్వరలో ఇటువంటి వెరైటీ సాంగ్స్ మరికొన్ని వినిపించిన తరువాత, రాజమాతని, యువరాజా వారిని మొదట సీమాంధ్రకి ఆ తరువాత తెలంగాణాకి ఆహ్వానించి తెలుగు ప్రజలందరినీ అనుగ్రహింపజేస్తారేమో? బళా కాంగ్రెస్...ఈ తెలివితేటలకే ప్రజలు గత అరవై ఏళ్లుగా ఫ్లాటయిపోతున్నారు.