జనవరిలో ఏపీ స్థానిక పోరు.. వైసీపీ కనీసం పోటీలోనైనా నిలిచేనా?
posted on Sep 4, 2025 @ 3:22PM
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల సందడి షూరూ కానుంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించాలని దాదాపుగా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేంది. వాస్తవంగా మార్చి తరువాత జరగాల్సిన స్థానిక ఎన్నికల షెడ్యూల్ ను మూడు నెలల ముందుకు జరపాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో ఇందుకు సంబంధించిన సన్నాహాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సహానీ ప్రారంభించేశారు. ఈ మేరకు సిబ్బందికి డిసెంబర్ లోగా ఓటర్ల జాబితా, పోలింగ్ బూత్ ల నిర్ణయం వంటివన్నీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు
స్థానిక ఎన్నికలను షెడ్యూల్ కంటే మూడు నెలల ముందుగానే నిర్వహించేందుకు ఎన్నికల సంఘానికి అవకాశం, అధికారం ఉంది. ఈ మేరకు ఈసీ మూడు నెలలు ముందుగానే స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రతిపాదనకు క్షణం ఆలస్యం చేయకుండా రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సర్కార్ పచ్చ జెండా ఊపేసింది.
ఇటీవల జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలలో వైసీపీ అడ్డాలోనే ఆ పార్టీని మట్టికరిపించిన ఉత్సాహంతో ఉన్న తెలుగుదేశం కూటమి సర్కార్.. మూడు నెలల ముందు స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు ఇసుమంతైనా వెనుకాడటం లేదు. అన్నిటికీ మించి తెలంగాణలోలా ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎటువంటి చట్టపరమైన ఆటంకాలూ లేవు. గతంలో 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందే స్థానిక ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఏడాదిన్నర తర్వాత జరుగుతున్నాయి. ముందుగా పంచాయతీ, పరిషత్ ఎన్నికలు ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తున్నది.
ఇక రాజకీయంగా చూసుకుంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక బరిలో వైసీపీ కనీస పోటీ అయినా ఇవ్వడం కష్టమే. అసలు పోటీకే దిగదని కూడా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పోటీ చేసి ఓటమి పాలవ్వడం కంటే.. బహిష్కరించి అధికార కూటమి ప్రభుత్వంపై అధికార దుర్వినియోగం అంటూ అభాండాలు వేయడానికి వైసీపీ మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు.