విదేశాలలో సేదతీరుతున్న నాయకులు.. అద్వానంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. హోరాహోరీ ప్రచార యుద్ధం ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూంలలో భద్రంగా ఉంది. పోలింగ్ సందర్భంగానూ, ఆ తరువాత చెలరేగిన హింసాకాండతో రాష్ట్రం అట్టుడికిపోయింది. ఆ ఉద్రిక్తతలు ఇప్పటికీ చల్లారలేదు. అయితే నెలల తరబడి ప్రచార పర్వంలో నిర్విరామంగా తిరిగిన పార్టీల నేతలు విశ్రాంతి మూడ్ లోకి వెళ్లి విదేశీ పర్యటనలలో సేదతీరుతున్నారు. అయితే రాష్ట్రంలో మాత్రం వేసవి వేడి ఒకింత చల్లబడినా, ఎన్నికల హింస మాత్రం రోహిణీకార్తె ఎండలను మించిపోయింది, 

 ఇక నేతల విదేశీ పర్యటనల విషయానికి వస్తే కోర్టు అనుమతి తీసుకుని మరీ ఈ నెల 17న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సమేతంగా  ఐరోపా పర్యటనకు వెళ్లారు.  వారంపాటు ప్రముఖ దేవాలయాలు సందర్శించి తరువాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు అమెరికా వెళ్లారు.ఆయన ఆరోగ్య పరిక్షలు చేయించుకోవడంతో పాటు అక్కడ ఒకింత విరామం తీసుకుని రిలాక్స్ అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  జనసేన సేనాని పవన్ కళ్యాణ్ కూడా రష్యా పర్యటనకు వెళ్లారు.  లోకేష్ కూడా అమెరికాలోనే ఉన్నారు.

ఇక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కూడా అమెరికా పర్యటనకు వెళ్లారు.  పార్టీ అధినేతల బాటలో ఇతర నాయకులు  పలువురు కూడా  విదేశీయానం చేస్తున్నారు.  పోలింగ్ పూర్తయిన తరువాత ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాల ప్రకటనకు మధ్య 22 రోజులు గడువు ఉండడంతో నాయకులు రిలాక్సేషన్ కోసం విదేశీ  పర్యటనలకు వెళ్లారు. అయితే నేతల విదేశీ పర్యటనలపై సీపీఐ నారాయణ విమర్శలు గుప్పించారు. రాష్ట్రం ఎన్నికల అనంతర హింసతో  అట్టుడుకుతుంటే నాయకులు విశ్రాంతి అంటూ విదేశాలకు వెళ్లడమేంటని నిలదీశారు.  

ఇక అత్యంత కీలకమైన ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. ఆ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఎన్నికల కమిషన్ పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సందర్భంగా జరిగిన హింస ట్రయల్ మాత్రమేననీ, ఓట్ల లెక్కింపు సందర్భంగా మరింత హింస ప్రజ్వరిల్లే అవకాశం ఉందనీ ఇప్పటికే ఇంటెలిజెన్స్ నివేదికలు ఇచ్చిన నేపథ్యంలో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. అదనపు బలగాలను కౌంటింగ్ అయిన తరువాత కూడా పక్షం రోజుల పాటు రాష్ట్రంలో ఉంచాలని ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ సందర్భంగా మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. అయినా కూడా ప్రజలలో మాత్రం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం అవుతూనే ఉంది. 

Teluguone gnews banner