తెలుగుదేశం కూటమి అఖండ విజయం ఖాయం.. తేల్చేసిన ఏబీపీ సర్వే
posted on Mar 15, 2024 @ 12:53PM
ఏపీలో తెలుగుదేశం కూటమి అఖండ విజయం ఖాయమని మరో సర్వే తేల్చేసింది. ఈ సారి ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఎదుర్కోబోతోందని ఆ సర్వే పేర్కొంది. తెలుగుదేశం, జనసేన కలవకుండా జగన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. సరే ఆ రెండు పార్టీల కూటమితో బీజేపీ కలవకుండా ఉండాలనీ, అదే జరిగితే తన పరాజయం ఖాయమని భావించిన జగన్ తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ పొత్తు పెట్టుకోకుండా ఉండేందుకు తన శక్తికి మించి ప్రయత్నించారు. ఏపీ బీజేపీలోని తన అనుకూలురతో లాబీయించ్ చేయించారు. ఆ ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో తాను స్వయంగా రంగంలోకి దిగి నేరుగా ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. అయినా బీజేపీ తెలుగుదేశం, జనసేన కూటమితో కలవడం ఖాయమని తేలిపోవడంతో మరోసారి మోడీతో భేటీ కోసం అప్పాయింట్ మెంట్ కోరి రోజుల తరబడి వేచి చూసినా ఫలితం లేకపోయింది.
ఇప్పుడు ఏపీబీ- సీవోట్ తాజా సర్వేలో ఆ మూడు పార్టీలూ కలిస్తే వైసీపీ కథ కంచికి చేరినట్లేనన్న జగన్ రెడ్డి భయాలు నిజమేనని తెలింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలోని పాతిక లోక్ సభ స్థానాలలో 20 స్థానాలలో విజయ దుందుభి మోగించనుందనీ, వైసీపీ మాత్రం ఐదు స్థానాలకే పరిమితం కానుందని ఏపీబీ- సీ ఓటర్ సర్వే పేర్కొంది.
ఏపీలో 20 లోక్ సభ స్థానాలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలుచుకోవడమంటే.. 2014 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి సాధించిన స్థానాల కంటే అధికం.ఏబీపీ- సీ ఓటర్ సర్వే ప్రకారం తెలుగుదేశం కూటమి 20 స్థానాలలో విజయం సాధిస్తుంది. ఆ సర్వే ఆధారంగా ఈ కూటమి అసెంబ్లీ స్థానాలలో ఎన్ని స్థానాలలో విజయం సాధిస్తుందన్నది లెక్కిస్తే తెలుగుదేశం కూటమి సంచలన విజయాన్ని నమోదు చేయడం ఖాయమని తేలుతుంది.
ఇదే ఏబీపీ- సీ ఓటర్ సర్వే గత నెలలో అంటే ఫిబ్రవరి నెలలో వెలువరించిన సర్వే ఫలితాలలో వైసీపీ రాష్ట్రంలో ఎనిమిది లోక్ సభ స్థానాలలో విజయం సాధిస్తుందని పేర్కొంది. అంతే కేవలం ఒక్క నెల వ్యవధిలో వైసీపీ మూడు పార్లమెంటు స్థానాలను కోల్పోయిందని చెప్పవచ్చు. అయితే ఒక సారి నోటిఫికేషన్ వెలువడిన తరువాత వైసీపీ డౌన్ ఫాల్ ఇంకా దారుణంగా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ పరాజయం పాలు అయ్యే పరిస్థితులు ఉంటే, ఓటర్లు నోటిఫికేషన్ వెలువడిన తరువాత మరింత పెద్ద సంఖ్యలో అధకార పార్టీకి వ్యతిరేకంగా ఓటింగ్ లో పాల్గొంటారని అంటున్నారు. అందునా కక్ష పూరిత రాజకీయాలకు పెట్టింది పేరైనా వైసీపీ విషయంలో ప్రజలు మరింత స్పష్టంగా తమ తీర్పు వెలువరించేందుకు ముందుకు వస్తారని అంటున్నారు.
ఇక మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కాంగ్రెస్ కాంగ్రెస్ అత్యధిక లోక్ సభ స్థానాలలో విజయం సాధిస్తుందని ఏబీపీ- సీఓటర్ సర్వే పేర్కొంది. తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలకు గాను కాంగ్రెస్ పది స్థానాలలో విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది. ఇక బీజేపీ, బీఆర్ఎస్ లు రెండేసి స్థానాలతో సరిపెట్టుకోవలసి ఉంటుందని పేర్కొంది. ఎంఐఎం ఒక స్థానంలోనూ, ఇతరులు రెండు స్థానాలలోనూ గెలిచే అవకాశాలున్నాయని ఏబీపీ- సీఓటర్ సర్వే పేర్కొంది.