లాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు!
posted on Jun 13, 2024 @ 5:43PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత జగన్ ప్రభుత్వం రైతుల భూముల మీద కన్నేసి తీసుకు వచ్చిన లాండ్ టైటిలింగ్ యాక్ట్.ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రద్దు చేశారు. గురువారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన కీలక ఫైల్స్ మీద సంతకం చేశారు. లాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన రెండో ఫైల్ మీద ఆయన సంతకం చేయడంతో, ఆంధ్రప్రదేశ్ రైతుల భూములకు పట్టిన గ్రహణం వదిలింది. చాలా లోపాలు కలిగి వుండటంతోపాటు రైతులు తమ భూముల మీద హక్కులు కోల్పోయే విధంగా వున్న ఈ యాక్ట్.ని రద్దు చేయాలని రైతులు ఎంత ప్రాధేయపడినా, వందలాది మంది లాయర్లు నిరసన వ్యక్తం చేసినా జగన్మోహన్ రెడ్డి మూర్ఖంగా ఈ చట్టాన్ని ఆమోదించారు. ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు నాయుడు ఈ చట్టం వల్ల ప్రజలకు కలిగే నష్టాన్ని వివరించారు. తాను అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట నెరవేరుస్తూ ఈ దారుణమైన చట్టాన్ని రద్దు చేశారు.