జగన్‌కి కొత్త భయం పట్టుకుంది!
posted on Jun 13, 2024 @ 6:03PM
ఒకపక్క నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలోనే వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్సీలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్సీలతోపాటు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కనిపించకుండా పోయారని అందరూ వెతుకుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ సమావేశంలో కనిపించారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు భారీ సంఖ్యలో పార్టీ మారే అవకాశం వుందని జగన్‌కి సమాచారం అందడంతో ఆయన అప్రమత్తం అయ్యారు. వాళ్ళు చేజారిపోకుండా చేసేందుకే జగన్ ఈ సమావేశం ఏర్పాటు చేశారని అంటున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఈ ఐదు సంవత్సరాలు కళ్ళుమూసి తెరిచేలోగా అయిపోయాయని, ఇంకో ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందని, అప్పటి వరకు ఓర్పుగా వుండాలని ఎమ్మెల్సీలకు సూచించారు. ‘ఓర్పుగా వుండటం’ అంటే అర్థం మరేదో కాదు.. పార్టీ వదిలి వెళ్ళిపోవద్దని అన్యాపదేశంగా చెప్పడమే. అధికారం పోయిన తర్వాత కష్టాలు రావడం సహజమని, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా వుండాలని ఆయన ఎమ్మెల్సీలకు ఉద్బోధించారు. మరి జగన్ కోరుకుంటున్నట్టు ఆయన పార్టీ ఎమ్మెల్సీలు కష్టాలు అనుభవించడానికి సిద్ధంగా వున్నారో లేదో కాలమే తెలియజేస్తుంది.