అశాస్త్రీయంగా భూముల విలువ పెంపు
posted on May 21, 2024 @ 5:56PM
భూమి అనేది పెరగదు.. కానీ భూమి విలువ మాత్రం పెరుగుతూనే వుంటుంది. ఒక్కోసారి భూమి విలువ ఆకాశంలోకి కూడా దూసుకెళ్తూ వుంటుంది. ఈ ఇంట్రడక్షన్ సంగతి అలా వుంచితే, ఈ రాష్ట్రం అని కాదు.. ఆ రాష్ట్రం అని కాదు... ఏ రాష్ట్రంలో అయినా భూముల విలువ పెంపు అనేది శాస్త్రీయంగా జరగడం లేదన్న అభిప్రాయాలున్నాయి. భూముల విలువ అవసరం అయినప్పుడు పెంచడం కాకుండా, ప్రభుత్వానికి డబ్బు అవసరం అయినప్పుడు పెంచుకుంటూ వెళ్ళడం అనే సంప్రదాయం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కొనసాగుతూ వస్తోంది. తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల విలువను పెంచారు. ఉదాహరణగా చెప్పాలంటే, పదేళ్ళ క్రితం ఎకరం రెండు లక్షల వరకు వున్న భూమి విలువ ఇప్పుడు పది లక్షలు దాటిపోయింది. ఇలా భూమి విలువ పెంచడం వల్ల ప్రజలకు కలిగే మేలు ఏమిటనే విషయం అలా వుంచితే, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగడం వల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెంచుకోవడం కోసం తప్ప ప్రభుత్వాలకు భూముల విలువ పెంచడం వెనుక మరో ఉద్దేశమేమీ కనిపించడం లేదు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన హామీలు తీర్చడానికి ప్రభుత్వానికి డబ్బు కావాలి. దానికి రేవంత్ రెడ్డికి కనిపించిన మొదటి మార్గం భూముల విలువ పెంచడం.. తద్వారా రిజిస్ట్రేషన్ రాబడిని పెంచుకోవడం. ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూముల విలువ పెంచే విషయంలో మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న విలువను ఏక్‌దమ్ రెడింతలు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా ఇష్టం వచ్చినప్పుడల్లా భూముల విలువ పెంచుకుంటూ వెళ్ళడం, భూముల విలువను పెంచడంతో శాస్త్రీయ విధానాన్ని అనుసరించకపోవడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతదేమోగానీ, సామాన్యుడికి భూమి అందుబాటులో లేకుండా పోతోంది.