టీఆర్ఎస్ టార్గెట్: లగడపాటి ల్యాంకో హిల్స్
posted on Jun 28, 2014 @ 10:27AM
రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచడానికి టీఆర్ఎస్‌ని ఢీకొన్న విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మీద కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు తన దృష్టిని కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో లగడపాటి రాజగోపాల్‌కు చెందిన ల్యాంకో హిల్స్‌కు మున్ముందు కష్టాలు తప్పవని టీఆర్ఎస్ నేత హరీష్ రావు హెచ్చరించడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. మెదక్ జిల్లాలో వక్ఫ్ భూముల సమీక్ష చేసిన సందర్భంగా మాట్లాడుతూ, ల్యాంకో హిల్స్ మీద తెలంగాణ మంత్రి హరీష్‌రావు స్పందించారు. ల్యాంకో సంస్థకు ఇచ్చిన భూములు హైదరాబాద్ శివారులోని హుస్సేనిషావలి దర్గాకు చెందినవని, అవి వక్ఫ్ ఆస్తులు కాదంటూ గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసును తమ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని తెలిపారు. ‘‘ల్యాంకోకు ఇచ్చిన దర్గా భూములు వక్ఫ్ ఆస్తి. ఈ భూములు అమ్మడానికి, కొనడానికి వీల్లేదని గతంలోనే హైకోర్టు స్పష్టం చేసింది. అప్పటి ప్రభుత్వం ఈ భూములు వక్ఫ్ ఆస్తి కాదంటూ సుప్రీంకోర్టులో కేసు వేసింది. వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాల్సిన ప్రభుత్వమే ఇలా చేయడం అంటే కంచే చేను మేసినట్లే. ఈ భూములు వక్ఫ్‌కే చెందాలని కేసు వేస్తాం’’ అని హరీష్ రావు చెప్పారు.