నేను పుట్టగానే చంపేయాలనుకున్నారు: స్మృతి ఇరాని
posted on Jun 28, 2014 @ 10:31AM
మోడల్‌గా, టీవీ నటిగా ప్రస్థానం ప్రారంభించి ఈ రెండు రంగాలలోనూ విశేష కీర్తిని ఆర్జించి, ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసిన స్మృతి ఇరాని ఇప్పుడు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దేశంలో ఇంత ఉన్నత స్థానంలో వున్న స్మృతి ఇరానీ పుట్టినప్పుడు ఆమె బంధువులు ‘ఆడపిల్ల పుట్టింది కాబట్టి చంపెయ్’ అని ఆమె తల్లికి సలహా ఇచ్చారు. అయితే ఆమె తల్లి మాత్రం బంధువుల మాటను ఎంతమాత్రం పట్టించుకోకుండా చిన్నారి స్మృతిని అల్లారుముద్దుగా పెంచింది. ఈరోజు ఈ స్థాయికి రావడానికి సహకరించింది. ఈ విషయాన్ని స్మృతి ఇరానియే వెల్లడించారు. ‘‘నేను పుట్టగానే ఆడపిల్ల భారమని మా అమ్మకు చెప్పారు. చంపేయమని కూడా బంధువులు సలహా ఇచ్చారు. కానీ మా అమ్మ ధైర్యవంతురాలు. వాళ్లు చెప్పినట్లు చేయకుండా నన్ను పెంచి పెద్ద చేసింది. ఆమె వల్లే ఈరోజు ఇలా మీ ముందున్నాను. ఎవరో చెప్పిన మాట విని తనను వదిలించుకునేందుకు నా తల్లి ప్రయత్నించలేదు. ఇందుకు ఆమెకు ధన్యవాదాలు’’ అన్నారు. బాలికలలతో జరిగిన ఒక ముఖాముఖి కార్యక్రమంలో స్మృతి ఇరాని మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. దేశంలో బాలికలను ప్రోత్సహించి, వారి అభ్యున్నతికి తోడ్పడవలసిన అవసరం వుందని ఆమె ఈ సందర్భంగా అన్నారు. బాలికలను ఆదరించి, ప్రోత్సహించడం వల్ల వారు ఏ స్థాయికి చేరుకుంటారన్నదానికి తానే ఒక ఉదాహరణ అని ఆమె అన్నారు.