కవిత సస్పెన్షన్.. చక్రం తిప్పిన కేటీఆర్?!
posted on Sep 2, 2025 @ 2:52PM
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో చర్చకు ప్రవేశ పెట్టిన సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు గట్టిగానే నిలబడ్డారు. బలమైన వాదనలతో అసెంబ్లీలో నివేదిక తప్పుల తడక అని చెప్పే విషయంలో ప్రశంసార్హమైన విధంగా వాదనలు చేశారు. సరే చివరికి ఆదివారం (ఆగస్టు 31) అర్ధరాత్రి సభ వేదికగా కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగిస్తున్నట్లు చేసిన ప్రకటన బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. సీబీఐ చేతికి కాళేశ్వరం వెడితే.. బీజేపీ దానిని అవకాశంగా చేసుకుంటుందనీ, ఈ కేసు ద్వారా బీఆర్ఎస్ ను బలహీనం చేసి రాష్ట్రంలో బలపడుతుందనీ బీఆర్ఎస్ లో ఆందోళన నెలకొంది.
ఇది చాలదన్నట్లు పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..సోమవారం (సెప్టెంబర్ 1) మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు జరిగాయని ధృవీకరించేశారు. అంతే కాదు.. ఆ అవినీతికి పాల్పడింది.. మాజీ మంత్రి హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ లేనంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అయితే తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం సుద్దపూస అని ఆయనను వెనకేసుకు వచ్చారు. ఇందుకు ఉదాహరణగా హరీష్ రావును కేసీఆర్ రెండో టర్మ్ లో ఇరిగేషన్ శాఖ నుంచి తొలగించడాన్ని చూపారు.
అయితే ఆమె ఎంతగా కేసీఆర్ కు క్లీన్ చిట్ ఇచ్చినా.. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనిచెప్పడం ద్వారా, అప్పటి ప్రభుత్వాధినేత అయిన తండ్రి కేసీఆర్ ను చిక్కుల్లో పడేశారని పరిశీలకులు అంటున్నారు. ఇక కవిత విమర్శలూ, ఆరోపణలూ రేవంత్ సర్కార్ వేయేనుగుల బలాన్ని అందించాయి. ఇక ముందు ముందు ఈ కేసులో సీబీఐ కవితకు నోటీసులు ఇచ్చి సాక్షిగా పిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వినా మరో గత్యంతరం లేదన్న భావనకు బీఆర్ఎస్ హైకమాండ్ వచ్చి ఉంటుందంటున్నాయి పార్టీ శ్రేణులు. అయితే ఇంత కాలంగా కవిత విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దంటూ వచ్చిన కేసీఆర్, ఇప్పుడు కూడా అదే మొతక వైఖరితో ఉంటారన్న అనుమానంతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రంగంలోకి దిగారని చెబుతున్నారు.
వాస్తవానికి చాలా కాలంగా కేటీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారనీ, ఈ మేరకు తండ్రిపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారనీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు కవిత విషయంలో తండ్రి మళ్లీ చూసీ చూడనట్లు వదిలేయకుండా కేటీఆర్ సోమవారం (సెప్టెంబర్ 1) కవిత మీడియా సమావేశం తరువాత స్వయంగా ఫామ్ హౌస్ కు వెళ్లి తండ్రిపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు చెబుతున్నారు. ఆయన రాత్రంతా ఫామ్ హౌస్ లో తండ్రితో చర్చించారనీ, కవితను సస్పెండ్ చేయకుంటే పార్టీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయని నచ్చచెప్పి కవిత సస్పెన్షన్ కు కేసీఆర్ ను ఒప్పించారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.