కృష్ణపట్నం ఆనందయ్య మళ్లీ అదృశ్యం!పోలీసులపై జనాల ఆగ్రహం..
posted on May 29, 2021 @ 11:36AM
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వారం రోజుల తర్వాత పోలీసుల నిర్భంధం నుంచి ఇంటికి వచ్చిన ఆనందయ్య.. మళ్లీ కనిపించకుండా పోయారు. తెల్లవారుజామున ఆనందయ్యను ఇంటి నుంచి పోలీసులు తీసుకెళ్లారని తెలుస్తోంది. ఆనందయ్య కనిపించకుండా పోవడంతో గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ఆనందయ్యను తమకు అప్పగించాలంటూ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కృష్ణపట్నంలో తీవ్ర ఉద్రికత్త నెలకొంది.
కృష్ణపట్నం ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందుపై ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. వారం రోజుల క్రితం అదృశ్యమైన ఆనందయ్య.. శుక్రవారం రాత్రి తన స్వగ్రామానికి చేరుకున్నారు. అప్పటికే ఆనందయ్య ఆచూకి చెప్పాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. ఐతే ఆనందయ్య ఇంటికి రావడంతో ఊపిర పీల్చుకున్న గ్రామస్తులు.. ఆయనకు రక్షణగా ఇంటిముందే నిద్రించారు. ఐతే శనివారం తెల్లవారు జామున ఆనందయ్య మళ్లీ కనిపించకుండాపోయారు. శనివారం తెల్లవారుజామున ఆయన్ను కృష్ణట్నం పోర్టుకు తరలించినట్లు సమాచారం.ఆనందయ్యకు భద్రత కల్పించడం కోసమే తీసుకెళ్తున్నట్లు పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. ఆనందయ్యను తరలించడంపై కృష్ణపట్నం గ్రామస్తులు మండిపడుతున్నారు. శనివారం ఉదయం కూడా ఆనందయ్య ఇంటి వద్దకు స్థానికులు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు అక్కడ భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. గ్రామ సరిహద్దుల్లో కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి స్థానికులనే గ్రామంలోకి అనుమతిస్తున్నారు.
ఇప్పటికే ఆనందయ్య మందును ఆయూష్ అధికారులు, టీటీడీ ఆయుర్వేద వైద్యులు పరిశీలించారు. ఆనందయ్య మందులో ఎలాంటి హానికర పదార్థాలు లేవని స్పష్టం చేశారు. దీంతో మందుపై అందరికీ మరింత నమ్మకం పెరిగింది. ప్రస్తుతం CCRAS అధ్యయనం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే CCRAS తన అధ్యయనం పూర్తి చేసిందని.. నివేదిక నేటికి సిద్ధంగా ఉంటుందని ప్రకటించారు. దీంతో ఆ నివేదికలో ఏముంది అన్నది ఇప్పుడు తీవ్ర ఆసక్తి పెంచుతోంది. CCRAS నివేదికను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటించే అవకాశముంది. అన్నీ బాగుంటే సోమవారం నుంచే మందును పంపిణీ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆనందయ్య మందుకు ఒకసారి క్లియరెన్స్ రాగానే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన తర్వాత మందు పంపిణీ చేస్తానని ఆనందయ్య ప్రకటించారు. మందు పంపిణీ చేస్తున్నట్లు వస్తున్న ప్రచారాన్ని నమ్మి ఎవరూ కృష్ణపట్నం రావొద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుమతిచ్చినా.. అవసరమైన మూలికలు లభించిన తర్వాతే మందును ఇస్తామని ఆనందయ్య స్పష్టం చేశారు. ఇప్పటికే ఆనందయ్య మందుకు విపరీతమైన డిమాండ్ వస్తున్న నేపథ్యంలో బ్లాక్ మార్కెట్ దందాను కూడా అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.