మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరనున్న కొండా దంపతులు
posted on May 5, 2013 @ 9:41PM
దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ పట్ల, కొండా సురేఖ దంపతులకు ఉన్న అభిమానం విశ్వాసం వలననే, వారిరువురూ మరోఆలోచన లేకుండా కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ మోహన్ రెడ్డికి బాసటగా నిలిచిన సంగతి అందరికీ తెలుసు. వారిరువురి కృషి మూలంగానే పార్టీకి తెలంగాణాలో బలమయిన పునాదులు ఏర్పాడాయి. అందుకు వారిరువుకి పార్టీలోమరింత ప్రాదాన్యత నిచ్చి కీలక బాధ్యతలు అప్పగించకపోగా, తెలంగాణాలో పార్టీ కొంచెం బలం పుంజుకొన్నాక ఏరు దాటినా తరువాత తెప్ప తగలేసినట్లుగా, ఇక వారి అవసరం తమకు లేదనే విధంగా వ్యవహరించడం మొదలుపెట్టారు.
జగన్ మోహన్ రెడ్డికి స్వయంగా చిన్నానయిన వైవీ.సుబ్బారెడ్డి నేతృత్వంలోవారికి వ్యతిరేఖంగా ఒక బలమయిన వర్గం ఏర్పాటు అవడం, జిల్లా రాజకీయాలలో పార్టీకి సంబంధించినంత వరకు కొండా దంపతుల ప్రమేయం లేకుండా నియామకాలు,కార్యక్రమాలు ఆ వర్గం వారు చేపట్టడంతో, కొండా దంపతులు కూడా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. కనీసం జగన్ మోహన్ రెడ్డి అయినా తమ ఆవేదనను పట్టించుకొంటారని ఆశించిన వారికి అక్కడా నిరాశే మిగిలింది.
పరకాల ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన కొండసురేఖ తాము ఆర్థికంగా చాలా నష్టపోయామని జగన్ మోహన్ రెడ్డికి మోర పెట్టుకొన్నపుడు, ఆయన కనీసం ఆమెపై సానుభూతి కూడా చూపకపోవడంతో, వారికి పార్టీలో తమ స్థానం ఏమిటో స్పష్టంగా అర్ధం అయింది. ఎవరి కోసం తమ సర్వస్వం త్యాగం చేసి వచ్చామో వారికే తమపట్ల ఆదరణ, అభిమానం లేన్నపుడు ఇక పార్టీలో ఉండి ప్రయోజనం ఏమిటని వారు వాపోయారు. పార్టీ అభివృద్ధి కోసం కష్టపడిన తమకి పార్టీలో గౌరవం లేకుండా పోవడంతో కొండా సురేఖ దంపతులు తమ రాజకీయ భవితవ్యం గురించి ఆలోచనలో పడ్డారు.
పార్టీలో క్రమంగా పెరుగుతున్న కులవివక్షను తట్టుకోవడం కూడా వారికి కష్టంగా మారడంతో, వారు తొలుత తెరాస వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. కానీ, తెరాస ఆమెకోరిన విధంగా పరకాల నుండి కాక భూపాల్‌పల్లి నియోజక వర్గం నుండి టికెట్ ఈయగలమని చెప్పడంతో సురేఖ దంపతులు వెనక్కి తగ్గారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికి, ఆప్తుడయిన మాజీ పిసిసి అధ్యక్షులు డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలోకి చేరవలసిందిగా ఆహ్వానించడంతో వారు తిరిగి కాంగ్రెస్ గూటికే చేరుకోవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఇంత వరకు వారిని నిర్లక్ష్యం చేసిన జగన్ మోహన్ రెడ్డి, వారు త్వరలో పార్టీ వీడనున్నారని తెలియగానే, వారిని సముదాయించేందుకు తన అనుచరుల ద్వారా ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ, కొండా దంపతులు మాత్రం పార్టీని వీడేందుకే నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. బహుశః వచ్చే వారం రోజుల్లోగా వారు తమ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.