కొమురవెల్లి మల్లన్న ఆలయం పక్కన శ్మశానవాటిక నిర్మాణాన్ని అడ్డుకుంటున్న భక్తులు
posted on Dec 16, 2019 @ 1:33PM
కొమురవెల్లి మల్లన్న , సిద్దిపేట జిల్లాకే తలమానికంగా వెలుగొందుతున్న ప్రముఖ శైవక్షేత్రం. ప్రతి సంవత్సరం 10 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతున్నాయి. ఆలయ అభివృద్ధి పై సీఎం కేసీఆర్ , జిల్లా మంత్రి హరీశ్ రావు కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఇలా అన్ని బాగానే ఉన్న సమయంలో మల్లన్న స్వామికి మల్లన్న భక్తులకు కొత్త సమస్య వచ్చిపడింది.ఆలయానికి అతి సమీపంలో సర్వే నెంబర్ 223లోని ప్రభుత్వ స్థలంలో జనావాసాల మధ్య శ్మశానవాటికను నిర్మించాలని నిర్ణయించారు అధికారులు , స్థానిక నాయకులు. శ్మశానవాటిక నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలం దేవాలయానికి 400 మీటర్ల దూరంలో ఉంది. స్వామి వారి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు ఆ ప్రదేశంలో తాత్కాలిక గుడారాలు వేసుకొంటారు. స్వామి వారికి పట్నాలు, బోనాలు సమర్పిస్తారు. ఆ కారణంగా మల్లన్న భక్తులు ఇటు గ్రామ ప్రజలు శ్మశానవాటికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఇదే స్థలంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తలపెట్టిన గెస్ట్ హౌస్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు భూమి పూజ కూడా చేశారు. 2 కోట్లతో రోడ్డు నిర్మాణం కూడా చేపట్టారు. ఈ విషయాన్ని యాదవ సంఘం నేతలు మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకువచ్చారు. స్మశాన వాటిక ఏర్పాటు కోసం ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని జిల్లా కలెక్టర్ కు హరీశ్ రావు సూచించారు. మంత్రి సూచనలతో ఆలయ సమీపం లో కాకుండా డంపింగ్ యార్డు దగ్గర శ్మశానవాటికను నిర్మించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మంత్రి, కలెక్టర్ మాటలు కూడా లెక్క చేయకుండా స్థానిక నేతలు భూ రికార్డులు మాయం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ సమీపంలోని దాసరి గుట్ట దగ్గర శ్మశానవాటికను నిర్మించాలని పట్టుదలగా ఉన్నారు. ధార్మిక సంస్థలు మాత్రం ఆగమశాస్త్రం ప్రకారం దేవాలయానికి దూరంగా శ్మశానవాటిక నిర్మించాలంటున్నారు. దేవాలయ కాలనీ వాసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని కులాల వారికి శ్మశానవాటికలు ఉన్నాయని.. కొత్తగా మరొకటి ఎందుకని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాలు అందజేశారు. భక్తుల మనోభావాలను గౌరవించి శ్మశానవాటికను ఆలయ అధికారులు స్థానిక నాయకులు వేరే స్థలంలో నిర్మిస్తారనే అంటున్నారు గులాబీ కార్యకర్తలు.