పాపం రజనీ అభిమానులకు ఎంత చిక్కొచ్చి పడింది...!
posted on Dec 11, 2014 @ 2:25PM
తమిళ సినీ ప్రపంచానికి మకుటం లేని మహారాజు వంటివాడు రజనీ కాంత్. తమిళనాడులోనే కాక ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆయనకు లక్షలాది అభిమానులున్నారు. రేపు ఆయన పుట్టిన రోజు. రేపే ఆయన నటించిన లింగా సినిమా కూడా విడుదల కాబోతోంది. అంటే రజనీ అభిమానులు అందరికీ పండగే పండుగన్నమాట. కానీ ఆ పండగ చేసుకోవడానికి వారు నానా అవస్థలు పడకతప్పలేదు. ఎందుకంటే తమ అభిమాన హీరో పుట్టినరోజునాడు గుడిలో అభిషేకాలు, రక్త, అన్నదాన కార్యక్రమాలు, ఆయన పోస్టర్లకు పాలాభిషేకాలు, కేక్ కంటింగులు, సాంస్కృతిక కార్యక్రమాలు వంటి చాలా హడావుడి ఉంటుంది. కానీ ఇవన్నీ చేస్తూ కూర్చొంటే అవతల లింగా సినిమా అయిపోతుంది. అందువలన తమ అభిమాన హీరో పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకోవాలా లేక ఆయన నటించిన సినిమాను మొదట షోని చూడాలా? ఏది ముందు ఏది తరువాత? దేని కోసం దేనిని వదులుకోవాలి? అని ఒకటే నలిగిపోయారు.
ఫేస్ బుక్ లో ‘రజనీ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా’ అభిమానులు కూడా దీనిపై సుదీర్గ చర్చించారు. చివరికి ఫేస్ బుక్ లోనే ఈ సమస్యకు ఒక పరిష్కారం కనిపెట్టారు. తమ హీరో పుట్టిన ఈరోజు అర్ధరాత్రి దాటిన తరువాత నుండి ఎప్పుడయినా చేసుకోవచ్చు కనుక, అభిమాన సంఘాల వారు అందరూ కలిసి లింగా సినిమా ప్రదర్శించబోయే సినిమా హాళ్ళ వద్దనే ఈరోజు సాయంత్రం 4గంటల నుండే రజనీకాంత్ జన్మదిన వేడుకలు మొదలుపెట్టేస్తారు. అవి రాత్రి ఒంటిగంట వరకు ఘనంగా సాగుతాయి. ఆ తరువాత రాత్రి ఒంటి గంటకు తమ కోసం లింగా సినిమా ప్రత్యేక షో వేయించుకొని చూసి ఆనందంగా బయటకు వస్తారు.
అయితే రాత్రి ఆ సమయంలో ఎక్కడా ప్రత్యేక షోలు వేయరు కనుక గత నెల రోజుల నుండే అందుకోసం రజనీ అభిమానులు ధియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు చుట్టూ తిరిగి అందరినీ ఒప్పించి ఈ ఏర్పాటు చేసుకొన్నారు. ఈరోజు సాయంత్రం చెన్నైలోని లింగా సినిమా విడుదలయ్యే కాశీ థియేటర్, మరో డజను థియేటర్ల వద్ద కూడా ఇటువంటి ఏర్పాట్లే జరిగిపోయాయి. బహుశః ఈ పాటికి అక్కడ కార్యక్రమాలు మొదలయి పోయి ఉండవచ్చు. అభిమానులను రజనీ పూని ఉండవచ్చుకూడా. ఏమయినప్పటికీ వారి అభిమానానికి థాంక్స్..వారి ఐడియాకు కంగ్రాట్స్..64ఏళ్ల బర్త్ డే బాయ్ రజనీకి గ్రీటింగ్స్..