కోహ్లీ క్యాచ్ ఆశలు రేపితే.. రాహుల్ డ్రాప్ ఆశలు తుంచేసింది!
posted on Dec 5, 2022 9:12AM
బంగ్లాదేశ్లో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ పరాజయం పాలైన సంగతి విదితమే. ఆద్యంతం అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో గెలుపు దోబూచులాట అటుంచితే.. తక్కువ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ లో ఒక క్యాచ్ భారత్ విజయానికి బాటలు పరిస్తే.. మరో క్యాచ్ ఆ బాటను మూసేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా కేవలం 186 పరుగులకే ఆలౌట్ అయ్యింది. వన్డే మ్యాచ్ లో ఇది చాలా పేలవమైన స్కోరు. అయితే ఈ మాత్రం స్కోరైనా భారత్ చేయగలిగిందంటే అందుకు రాహుల్ బ్యాటింగే కారణం. పరుగులు రాబట్టడం కష్టమైన పిచ్ పై రాహుల్ పట్టుదలతో ఆడి 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. దీంతో 187 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ కు మంచి ఆరంభం లభించలేదు. ఇన్నింగ్స్ తొలి బంతికే తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ ఆ తరువాత ఆచితూచి ఆడింది.
అయితే భారత బౌలర్లు విజృంభించి క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి బంగ్లాను కష్టాల్లో పడేశారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ పట్టిన ఓ క్యాచ్ భారత్ విజయానికి బాటలు వేసింది. ఇన్నింగ్స్ 24వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో షఖిబ్ అల్ హసన్ ఇచ్చిన కష్టమైన క్యాచ్ ను కోహ్లీ అద్భుతంగా పట్టుకున్నాడు. ఈ మ్యాచ్ మొత్తానికి ఆ క్యాచే హైలైట్ అనడంలో సందేహం లేదు. అప్పటికి షకిబ్ అల్ హసన్ 38 బంతుల్లో మూడు ఫోర్లతో 29 పరుగులు చేశాడు.
బంగ్లాదేశ్ స్థిరంగా విజయం వైపు సాగుతోంది. కానీ ఆ క్యాచ్ ఒక్కసారిగా మ్యాచ్ ను భారత్ వైపు తిప్పింది. షకిబ్ అల్ హసన్ తరువాత బంగ్లా బ్యాటర్లు క్యూ కట్టారు. 136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే మెహదీ హసన్ మిరాజ్ భారత్ కు విజయానికి అడ్డుగోడలా నిలిచాడు. కానీ.. 42.3 ఓవర్ల వద్ద మిరాజ్ ఇచ్చిన సులభమైన క్యాచ్ ని కేఎల్ రాహుల్ డ్రాప్ చేశాడు. దీంతో భారత్ విజయానికి కోహ్లీ పట్టిన క్యాచ్ వేసిన బాటను.. రాహుల్ క్యాచ్ డ్రాప్ మూసేసింది. మిరాజ్ ఆ తరువాత నిలకడగా ఆడి బంగ్లాను విజయతీరాలకు చేర్చాడు.