అయ్యో పాపం కొడాలి నాని.. టికెట్ చింపేసిన జగన్?!
posted on Feb 19, 2024 @ 4:09PM
బూతులమంత్రిగా అనితర సాధ్యమైన ప్రఖ్యాతి పొందిన గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి వైసీపీ అధినేత జగన్ గాలి తీసేశారా? వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లేదని చెప్పకనే చెప్పేశారా అంటే నాని అనుచరులు ఔననే అంటున్నారు. నానికి పోటీగా జగన్ గుడివాడ నియోజకవర్గం నుంచి హన్మంతరావును రంగంలోకి దింపనున్నారని పార్టీ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నానికి జగన్ హ్యాండిచ్చేశారనీ, నియోజకవర్గంలో నానికి తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందన్న నివేదికలను చూపి, ఆయనకు టికెట్ నిరాకరించేందుకు రెడీ అయిపోయారనీ నాని అనుచరులే చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణంగా గుడివాడ నియోజకవర్గంలో వెలసిన హన్మంతరావు ఫ్లెక్సీలను చూపుతున్నారు. ఐప్యాక్ సూచన మేరకు జగన్ కొడాలి నానిని పక్కన పెట్టేసి, హన్మంతరావును గుడివాడ అభ్యర్థిగా తెరపైకి తెచ్చారని అంటున్నారు. హన్మంతరావు గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
జగన్ ఏపీ సీఎం అయిన తరువాత ఆయన కొడాలి నానికి సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. గుడివాడ ఎమ్మెల్యే నాని జగన్ కు వీర భక్త హనుమాన్ లాంటి వారు. జగన్ మెప్పుకోసం కొడాలి నాలి ముందు వెనుకలాలోచించకుండా అసెంబ్లీలోనూ, బయటా కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లపై ఇష్టారీతిగా నోరు పారేసుకున్నారు. చంద్రబాబు కుటుంబంపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తన భాషతో అత్యంత వివాదాస్పదుడిగా మారారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం నాని లక్ష్యంగా ఎదురుదాడి చేస్తోంది. క్యాసినో నుంచి గుడివాడలో జరిగే దందాలను బయటపెడుతూ వస్తోంది.ఎట్టి పరిస్థితిలో నానిని అసెంబ్లీలో అడుగుపెట్ట నీయకూడదన్న లక్ష్యంతో గుడివాడ నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
అయితే కాగల కార్యం గంధర్వులే తీర్చారన్న చందంగా నాని ఎన్నికల బరిలోకి దిగకుండానే ఓడిపోయారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకే చాన్స్ ఇవ్వకూడదని జగన్ నిర్ణయం తీసుకున్నారు. జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచీ ఆయనకు వీర విధేయుడిగా ఉంటూ.. ఆయన మొప్పు కోసం బూతుల నానిగా మారిపోయిన కొడాలి నానికి జగన్ టికెట్ చింపేయడం పార్టీ వర్గాలనే విస్మయ పరుస్తోంది. నాని అభ్యర్థిగా ఉంటే గుడివాడలో వైసీపీ ఓటమి ఖాయమన్న ఐప్యాక్ నివేదిక ప్రాతిపదికగా జగన్ కొడాలి నాని స్థానంలో మండలి హన్మంతరావును గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెరపైకి తీసుకువచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హఠాత్తుగా గుడివాడ నియోజకవర్గంలో మండలి హన్మంతరావు ఫ్లెక్సీలు వెలియడం వైసీపీ వర్గాలలో సంచలనం సృష్టించింది. వాస్తవానికి జగన్ కు కొడాలి నాని వీరభక్త హనుమాన్ వంటి వాడైతే.. కొడాలి నానికి మండలి హన్మంతరావు అటువంటి వాడని నాని అనుచరులు చెబుతున్నారు. అయితే ఇటీవలే మండలి హన్మంతరావు తాడేపల్లి ప్యాలెస్ పిలుపు మేరకు అక్కడకు వెళ్లి సీఎంవో అధికారులతో మాట్లాడి వచ్చారు. అక్కడ ఏం జరిగిందో, ఏమైందో తెలియదు కానీ, సీఎంవో అధికారులతో భేటీ అనంతరం హన్మంతరావు ఫ్లెక్సీలు నియోజకవర్గం అంతటా వెలిశాయి. గుడివాడ వైసీపీ అభ్యర్థగా హన్మంతరావు పేరు దాదాపు ఖరారైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ పరిణామంలో కొడాలి నాని అనుచరులు భగ్గు మంటున్నారు. కొడాలి నానికి టికెట్ నిరాకరిస్తే.. జగన్ అయినా సరే తగిన గుణపాఠం చెబుతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. మొత్తం మీద సిట్టింగుల మార్పు అంటూ కొడాలి నాని సీటుకే జగన్ ఎసరు పెట్టారని అంటున్నారు. గతంలో మంత్రివర్గ విస్తరణ సమయంలో కూడా కొడాలి నానికి జగన్ ఇలానే ఝలక్ ఇచ్చారనీ చెబుతూ, అప్పట్లో నాని కొంత కాలం ప్రజలకు, పార్టీకి కూడా అందుబాటులో లేకుండా తన పశువుల పాకలో పడుకుని శూన్యంలోకి చూస్తూ గడిపేశారని అంటున్నారు. అప్పట్లో పశువుల పాకలో పడుకుని నాని ఒంటరిగా శూన్యంలోకి చూస్తున్న ఫొటోలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా మరోసారి కొడాలి నానికి జగన్ అదును చూసి చేయిచ్చారనీ, వాడుకుని వదిలేయడంలో జగన్ ను మించిన వారు లేరని మరో సారి రుజువైందని అంటున్నారు.