పులి, సింహం కాదు.. పిల్లి! బాబు సవాల్ తో తాడేపల్లి ప్యాలెస్ గజగజ!
posted on Feb 20, 2024 8:12AM
మా జగనన్న పులి, సింహం.. దమ్ము ధైర్యం కలిగిన నాయుడు.. అలాంటి నాయకుడు మా అధినేత కావడం మాకు గర్వకారణం.. అంటూ.. ఇన్నాళ్లు వైసీపీ నేతలు, కార్యకర్తలు తెగ గొప్పలు చెప్పుకున్నారు. కానీ ప్రస్తుతం వారు జగన్ నిజస్వరూపం తెలిసి జగనన్నా మా పరువు తీశావు కదయ్యా అంటూ గగ్గోలు పెడుతున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విసిరిన చాలెంజ్ కు జగన్ శిబిరం బెంబేలెత్తిపోయింది.. ఒక విధంగా చెప్పాలంటే తాడేపల్లి ప్యాలెస్ గడగడలాడింది. ఇదేమీ తెలియని వైసీపీ కార్యకర్తలు.. మా జగనన్న ధీరుడు శూరుడు చంద్రబాబు చాలెంజ్ ను స్వీకరిస్తాడని భావించారు. తీరా.. సజ్జల మీడియా ముందుకొచ్చి మేం సవాల్ ను స్వీకరించం అంటూ చేతులెత్తేశారు. దీంతో చొక్కా చేతులు మొడతపెట్టాల్సిన వైసీపీ కార్యకర్తలు. గ్రామాల్లో తల వంచుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగనన్న ఎందుకింత పనిచేశాడు..! చంద్రబాబు సవాల్ ను స్వీకరిస్తే బాగుండేది కదా. అంటూ వైసీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. వాళ్లకు తెలియాల్సిన అసలు విషయం ఏమిటంటే.. జగన్ చాలెంజ్‌ను స్వీకరించడానికే నాలుగున్నరేళ్లలో ఏమైనా అభివృద్ధి చేస్తేకదా..!
ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో అధికార వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. ప్లీజ్ ఒక్కసారి అధికారం ఇవ్వండి అంటూ ఏపీ ప్రజలను బ్రతిమాలి, సానుభూతితో మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్.. నాలుగున్నరేళ్ల కాలంలో ఏపీ ప్రజలు గర్వంగా చెప్పుకునేలా ఒక్కటంటే ఒక్క పనికూడా చేయలేదు. కేవలం ప్రతిపక్ష నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ, తప్పుడు కేసులతో వాళ్లను జైలుకు పంపించడమే పనిగా జగన్ నాలుగున్నరేళ్ల పాలన సాగింది. దీనికితోడు జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏఒక్క హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చలేదు. దీంతో చంద్రబాబు సవాల్ ను స్వీరించేందుకు జగన్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. పైగా, సజ్జల మీడియా ముందుకొచ్చి.. మా నేత గొప్పనేత.. జాతీయ స్థాయిలో పలుకుబడి కలిగిన నేత అన్నట్లుగా జగన్ కు ఛాలెంజ్ విసిరే అర్హత చంద్రబాబుకు లేదంటూ పేర్కొనడం వైసీపీ శ్రేణులను కూడా విస్మయానికి గురిచేసింది.
ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి సిద్ధం సభల పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆదివారం (ఫిబ్రవరి 18)అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో జగన్ చంద్రబాబు మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు.. దీంతో చంద్రబాబు జగన్ కు సవాల్ చేశారు.. దమ్ముంటే చర్చకురా.. ఎవరి పాలనలో అభివృద్ధి జరిగింది.. ఎవరి పాలనలో విధ్వంసం జరిగిందో చర్చింద్దాం.. టైం నువ్వేచెప్పు.. ఏ టైంలోనైనా నేను చర్చకు సిద్ధం.. జగన్ రెడ్డీ నువ్వు రెడీనా? అంటూ ఒక్కసారికాదు.. రెండు సార్లు చంద్రబాబు సవాల్ చేశారు. దీంతో తాడేపల్లి ప్యాలెస్ వణికిపోయింది. వెంటనే ఐప్యాక్ టీం, వైసీపీ ముఖ్యనేతలను పిలిపించుకొని జగన్ వారితో మంతనాలు జరిపాడు. చంద్రబాబు సవాల్ స్వీకరించాలా? వద్దా? అనే విషయంపై అభిప్రాయాలు తీసుకున్నారు. ఐప్యాక్ సిబ్బందితోపాటు వైసీపీ ముఖ్యనేతలుసైతం.. మనం నాలుగేళ్లలో ఏం అభివృద్ధి చేశామని సవాల్ ను స్వీకరిస్తాం అంటూ జగన్ ముందే కుండబద్దలు కొట్టేసినట్లు సమాచారం. దీంతో పలు విధానాలుగా ఆలోచనలు చేసిన అనంతరం.. జగన్ కు సవాల్ విసిరే స్థాయి చంద్రబాబు లేదంటూ మీడియా ముందు చెప్పాలని సజ్జలకు జగన్ సూచించారు. ఎప్పటిలాగానే మీడియా ముందుకొచ్చిన సజ్జల.. అదీఇదీ కొద్దిసేపు చెప్పి చంద్రబాబు సవాల్ ను మేం స్వీకరించం అంటూ చేతులెత్తేశారు.
టీడీపీ, జనసేన కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతుండటంతో వైసీపీ నేతల్లో ఇప్పటికే భయం పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు అసాధ్యమన్న భావనకు వారు వచ్చేశారు. తాజాగా చంద్రబాబు సవాల్ ను జగన్ స్వీకరించకపోవటంతో విజయంపై ఏమూలో ఉన్న చిన్నపాటి ఆశకూడా ఆవిరైపోయిందని వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలు ఆవేదన చెందుతున్నారు. సభల్లో చొక్కాల చేతులు మడత పెట్టండి అని చెబుతున్న జగన్.. ప్రతిపక్ష నేత సవాల్ ను స్వీకరించక పోవటం స్థానికంగా తమను తీవ్ర ఇబ్బందికి గురిచేస్తున్నట్లు వైసీపీ కార్యకర్తలు వాపోతున్నారు. ఇన్నాళ్లూ పులి, సింహం అంటూ జగన్ గురించి గొప్పలు చెప్పుకున్నాం.. కానీ, తాడేపల్లి ప్యాలెస్ లో ఉంది పులి, సింహం కాదు.. పిల్లి అని తేలిపోయింది.. ఇక ప్రతిపక్షాలకు ఏమని సమాధానం చెప్పాగలం వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.