Read more!

మళ్లీ బూతుల పంచాంగం విప్పిన కొడాలి నాని

కొడలి నాని, మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మళ్లీ తన బూతుల పంచాంగం దుమ్ము దులిపారు. మంత్రిగా ఉన్న సమయంలో నిత్యం విపక్ష నేతపై విమర్శలతో విరుచుకుపడిన నాని.. మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యాకా.. తన వాగ్ధాటికి కొంత బ్రేక్ వేశారు.

మంత్రి పదవి నుంచి ఊడబీకినందుకు అసంతృప్తో, నిరసనో తెలియదు కానీ, ఆయన ఒకింత మౌనం పాటించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ హెల్త్ వర్శిటీగా మార్చిన సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరినప్పటికీ ఆ నిర్ణయాన్ని సమర్ధిస్తూ మీడియా సమావేశం పెట్టలేదు. అలాగే మంత్రి పదవి ఊడిన తొలి నాళ్లలో ఓ విధమైన వైరాగ్యం ప్రదర్శించారు. పశువుల పాకలో పడుకున్నారు. అప్పట్లో అందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి కూడా. అప్పట్లో ఓ పశువుల కొట్టంలో  మంచమేసుకొని.. రెండు దిండ్లు ప‌రుచుకుని.. హాయిగా రిలాక్స్ అవుతున్న ఫొటో బాగా సర్క్యులేట్ అయ్యింది.

అప్ప‌టి వ‌ర‌కూ ప‌శువుల కొట్టంలో ప‌ని చేసి..చేసి అల‌సిపోయి  కాసేపు ఇలా సేద‌తీరుతున్న‌ట్టు ఉందీ ఫోటో అంటూ అప్పట్లో నెటిజన్లు సెటైర్లు కూడా వేశారు. అంతేనా.. మంత్రి ప‌ద‌వి పోయింద‌నే ఫ్ర‌స్టేష‌న్‌లో ఉన్న‌ట్టున్నారు. జ‌గ‌న్ కోసం అంత చేసిన నా ప‌ద‌వే పీకేస్తాడా అంటూ తెగ ఫైర్ మీదున్నట్లున్నాడు అని కొందరు కామెంట్లు చేస్తే.. ఇక‌పై ప్రెస్‌మీట్లు ఉండవు, బూతులు మాట్లాడే ఛాన్స్ రాదు అన్న బాధ అనుకుంటా అంటూ మరి కొందరు వ్యాఖ్యలు చేశారు. కార‌ణం ఏమో తెలీదు కానీ.. ఆయ‌న తీవ్ర అసంతృప్తితో, ఆవేద‌న‌తో ఉన్నార‌ని అప్పట్లో కొడాలి నాని అనుచ‌రులు గట్టిగా చెప్పారు. అలాంటి నాని ఒక్క సారిగా మళ్లీ బూతుల పంచాంగం విప్పారు. తెలుగు అధినేత చంద్రబాబుపై  విమర్శలు ఎక్కుపెట్టారు. సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి దివంగత ఎన్టీఆర్ అయితే... చంద్రబాబు ఒక 420 అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని టీడీపీలో చేరిన చంద్రబాబు... ఆయన బతికుండగానే సీఎం పదవి నుంచి తప్పించారని అన్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెడతారని చంద్రబాబును ఉద్దేశించి ఎన్టీఆర్ ఆనాడే చెప్పారని తెలిపారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి సీఎం సీటును లాక్కున్నారని దుయ్యబట్టారు. 

ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుట్టామని చెప్పుకుంటున్నవాళ్లు సిగ్గులేకుండా చంద్రబాబు వెనుక తిరుగుతున్నారని కొడాలి నాని విమర్శించారు. ఎన్టీఆర్ లా చాలా పౌరుషం ఉన్న వ్యక్తి హరికృష్ణ మాత్రమేనని చెప్పారు. ఎన్టీఆర్ లా సొంతంగా పార్టీ పెట్టి సీఎం అయిన వ్యక్తి జగన్ మాత్రమేనని అన్నారు. చంద్రబాబుకు స్వార్థం ఎక్కువని... ఎన్టీఆర్ పేరు చెప్పుకుని ఇప్పుడు కూడా ఓట్లు దండుకోవాలని అనుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు కనుసన్నల్లోనే అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగిందని ఆరోపించారు.

ఇంత హఠాత్తుగా కొడాలి నాని తన గొంతు సవరించుకుని మరీ విమర్శల చిట్టా విప్పి మీడియా ముందుకు రావడానికి కారణం నేడో, రేపో, రేపో, మాపో జగన్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టే అవకాశాలున్నాయన్న సమాచారమేనని పరిశీలకులు అంటున్నారు. ముచ్చటగా మూడో సారి జగన్ చేపట్ట నుంచి మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో కొడాలి నానికి కచ్చితంగా బెర్త్ దొరుకుతుందన్న సమాచారంతోనే నాని ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారని చెబుతున్నారు. అందుకే ఇటీవలి కాలంలో ఒకింత సైలెంట్ గా ఉంటూ వస్తున్న నాని మళ్లీ బూతుల మంత్రిగా తనకు ఉన్న ఫేమ్ ను పూర్తిగా ఉపయోగించుకునేందుకు రెడీ అయిపోయారని అంటున్నారు.