Read more!

డైవర్షన్ కే విస్తరణ.. ముందస్తుకే జగన్ మొగ్గు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నోటితో చెప్పేదొకటి.. చేతల్లో చేసేదొకటి. గత నాలుగేళ్లుగా ఆయన పాలన సాగిస్తున్న విధం ఇదే. ఇప్పుడు తాజాగా పార్టీ సర్కిల్స్ లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పుడ ఇహనో ఆయన కేబినెట్ రీషఫుల్ చేస్తారనీ, కొత్తగా నలుగురైదుగురికి కేబినెట్ లోకి తీసుకుంటారనీ పార్టీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. అదే సమయంలో కొందరికి ఉద్వాసన తప్పదనీ అంటున్నారు.

సరే ఇన్ ఎవరు.. ఔట్ ఎవరు అన్న చర్చను పక్కన పెడితే.. మంత్రివర్గ విస్తరణ అనేది ఒక వ్యూహం మాత్రమేననీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగేందుకు వీలుగా ఆయన పావులు కదుపుతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ తో ముందస్తు ముచ్చటకు జగన్ చెల్లుచీటీ పాడేశారన్న భావన విపక్షాలలో కలిగించడమే ఆయన వ్యూహంగా చెబుతున్నారు. వైనాట్ 175 ధీమా పూర్తిగా పోయిన తరుణంలో ఆయన వైనాట్ ఎర్లీ ఎలక్షన్స్ అన్న వ్యూహంతో పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. వివేకా హత్య కేసు విషయం అలా ఉంచితే.. కేవలం పక్షం రోజుల వ్యవథిలో ఆయన రెండు సార్లు హస్తినకు వెళ్లి చక్కబెట్టుకోవడానికి ప్రయత్నించిన రాచకార్యం ముందస్తే అని పరిశీలకులు అంటున్నారు. అందుకోసమే ఆయన తాజా ఢిల్లీ పర్యటనలో హడావుడిగా అమిత్ షా అప్పాయింట్ మెంట్ తీసుకున్నారనీ, అర్ధరాత్రి ఆయన నివాసానికి వెళ్లి మరీ సుదీర్ఘ భేటీ జరిపారనీ అంటున్నారు.  

ఈ సందర్భంగా ఏపీలో పరిస్థితిని జగన్ అమిత్ షాకు పూసగుచ్చినట్లు వివరించడమే కాకుండా, విపక్షాలు ప్రమత్తంగ ఉన్న సమయంలోనే ముందస్తుకు వెళితే ఏదో మేరకు అధికారపార్టీకి లాభం ఉంటుందని వివరించారని అంటున్నారు. అందుకోసం.. ఈ డిసెంబర్ లోనే అంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగితే.. తెలుగుదేశం పార్టీకి ఇటు ఏపీలోనూ, అటు తెలంగాణలోనూ కూడా ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, పొత్తులు తదితర విషయాలలో కాన్ సన్ ట్రేట్ చేసే అవకాశం ఉండదని జగన్ అమిత్ షాకు వివరించి ఉంటారని పరిశీలకులు చెబుతున్నారు. అసలు తెలంగాణతో పాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించాలన్న తన అభిమతాన్ని కేంద్రానికి చెప్పి అనుమతి, అంగీకారం తీసుకునేందుకే స్వల్ప వ్యవధిలో రెండు సార్లు జగన్ హస్తినకేగి వచ్చారని విశ్లేషిస్తున్నారు.  

జగన్ ముందస్తు నిర్ణయానికి రావడానికి కారణం ఇటీవల ఆయన స్వయంగా చేయించుకున్న సర్వే ప్రకారం ముందస్తు ఎన్నికలు జరిగితే జగన్ బొటాబొటిగా, అంటే అత్తెసరు మెజారిటీలో అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉందని తేలిందనీ, అదే నిర్దిష్ట గడువు వరకూ ఆగితే.. ప్రభుత్వ వ్యతిరేకత మరింత పెరిగి.. మొదటికే మోసం వస్తుందన్న సర్వే ఫలితం కారణంగానే ముందస్తు అడుగుల జోరు పెంచారని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే  ఆరు నెలల అధికారాన్ని వదులుకుని మరీ ముందస్తుకు జగన్ మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. అన్నిటికీ మించి ముందస్తుకు తొందరపడకపోతే.. ఏపీలో 2014 నాటి సీన్ పునరావృతమౌతుందన్న భయం జగన్ లో గూడుకట్టుకుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అంటే తెలంగాణ ఎన్నికల తరువాత ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.. ఏపీలో బీజేపీ కూడా తెలుగుదేశం, జనసేన కూటమితో కలిసి పోటీ చేయాల్సిన పరిస్థితులు వస్తాయన్నది జగన్ భావనగా చెబుతున్నారు. అంటే తెలంగాణలో సపోజ్.. ఫర్ సపోజ్ హంగ్ వస్తే ( తెలంగాణలో హంగ్ కే ఎక్కువ అవకాశాలున్నాయని సర్వేలు చెబుతున్నాయి) అప్పుడు బీజేపీ అధికారం కోసం తెలుగుదేశం మద్దతు తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా ఏపీలో బీజేపీ మద్దతు కోసం తెలంగాణలో ఆ పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఇసుమంతైనా వెనుకాడదని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నాయి.

ఆ విషయంలో బీజేపీకి సంకేతం ఇవ్వడానికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో వంద స్థానాలలో పోటీకి తెలుగుదేశం ఇప్పటికే రెడీగా ఉందని ఇటీవల హైదరాబాద్ లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రకటించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే జగన్ ముందస్తుకు తొందరపడుతున్నారనీ, ఏలాగైనా సరే కేంద్రాన్ని ఈ విషయంలో ఒప్పించేందుకే వరుస హస్తిన పర్యటనలనీ అంటున్నారు.