కొడాలి, వల్లభనేని ఔట్.. తేల్చేసిన ఎగ్జిట్‌పోల్స్
posted on Jun 2, 2024 8:44AM
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఏపార్టీ అధికారంలోకి వస్తుంది? గెలిచే అభ్యర్థులు ఎవరు..? ఓటమి చవిచూసే వారు ఎవరు? అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయి.. అధికార పార్టీ వైసీపీ నుంచి ఓడిపోనున్న ప్రముఖులు ఎవరు? అనే ఉత్కంఠ ఏపీ రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతిఒక్కరిలో నెలకొంది. ఏపీలో మే13న 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 82శాతం పోలింగ్ నమోదైంది. దాదాపు 300 పోలింగ్ కేంద్రాల్లో అర్థరాత్రి 2గంటల వరకు ఓటింగ్ జరిగింది. భారీగా ఓటింగ్ జరగడంతో ఎవరికి లాభం చేకూరుతుందనే విషయంలో ఇరు పార్టీల నేతలు టెన్షన్ పడుతున్నారు. అయితే, భారీ ఓటింగ్ అధికార పార్టీ వైసీపీ ఓటమికి కారణం కాబోతుందన్న చర్చ ప్రధానంగా జరుగుతోంది.
తాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ సర్వేలు సైతం అదే విషయాన్ని స్పష్టం చేశాయి. మూడు, నాలుగు ఎగ్జిట్ పోల్స్ మినహా మిగిలిన అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి రాబోతున్నట్లు స్పష్టమైంది. ఇది తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ఐదేళ్ల అవిశ్రాంత పోరాటానికి తగిన ఫలితం రాబోతోందన్న ధీమా వారిలో వ్యక్తం అవుతోంది. అంతకు మించి తెలుగుదేశం శ్రేణులలో ఉత్సాహంతో ఉరకలేసేలా చేస్తున్నదేంటంటే గన్నవరంలో వల్లభనేని వంశీ, గుడివాడలో కొడాలి నాని, నగరిలో ఆర్కే రోజా, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు ఓటమి పాలవుతున్నట్లు అన్ని సర్వేలూ విస్పష్టంగా తేల్చి చెప్పేయడం.
2019 ఎన్నికల్లో వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో కొద్దిరోజులకే గోడదూకి జగన్ పార్టీలో చేరిపోయారు. వైసీపీలోకి వెళ్లిన వంశీ తన నోరుకు అదుపులో ఉంచుకోకుండా చంద్రబాబు, నారా లోకేశ్ పై ఇష్టారీతిలో మాట్లాడారు. దీనికితోడు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలుగుదేశం శ్రేణులు వంశీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వల్లభనేని వంశీని ఓడించేందుకు టీడీపీ నేతలు తీవ్రంగా కష్టపడ్డారు. అన్ని వర్గాల ప్రజలను కూడగట్టుకొని వంశీ ఓటమికి కృషి చేశారు. ఫలితంగా ప్రస్తుతం వల్లభనేని వంశీ ఓడిపోతున్నారని పలు సర్వేలు తేల్చిచెప్పడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరో వైపు కొడాలి నానిసైతం ఈ ఎన్నికలో ఓడిపోతున్నాడని పలు సర్వే సంస్థలు స్సష్టం చేశాయి. గుడివాడ నుంచి విజయం సాధించిన కొడాలి నాని గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు, నారా లోకేశ్, నందమూరి కుటుంబాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అభ్యంతరకర వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. దీంతో ఈ ఎన్నికల్లో కొడాలి నానిని ఓడించేందుకు తెలుగుదేశం నేతలు పట్టుదలతో పనిచేశారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టుకొని కూటమి అభ్యర్థి విజయానికి అహర్నిశలు కృషి చేశారు. తాజాగా వెల్లడైన సర్వే ఫలితాల్లో కొడాలి నాని ఓడిపోతున్నారని తేలింది. దీంతో ఇద్దరు బూతుల నేతలు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం లేదని తెలుస్తోంది.
వల్లభనేని వంశీ, కొడాలి నానితో పాటు నగరి నియోజకవర్గం నుంచి రోజా సైతం ఓడిపోతున్నారని సర్వే సంస్థలు తేల్చిచెప్పాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ జగన్ క్యాబినెట్ లో మంత్రులందరిదీ ఓటమి బాటేనని అంచనా వేశాయి. సత్తెనపల్లి నుంచి అంబటి రాయుడు, పలాస నుంచి సిదిరి అప్పరాజు, శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం ధర్మాన ప్రసాద్‌రావు, గాజువాక నుంచి పోటీచేసిన గుడివాడ అమర్నాద్, తణుకు నుంచి పోటీ చేసిన కారుమూరి నాగేశ్వరరావు, రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసిన చెల్లుబోయిన వేణుగోపాల్ రావు, తాడేపల్లి గూడెం నుంచి పోటీ చేసిన కొట్టు సత్యనారాయణ, పెనమలూరు నుంచి పోటీచేసిన జోగి రమేష్ , గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న విడుదల రజని, సంతనూతలపాడు నుంచి పోటీ చేస్తున్న మేరుగ నాగార్జున, అలాగే ఆదిమూలపు సురేష్, ఉషశ్రీ చరణ్ తోపాటు పలువురు వైసీపీ అభ్యర్థులు ఓడిపోతారని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. మొత్తానికి ఈ ఎన్నికల్లో వైసీపీకి ఘోర ఓటమి తప్పదని సర్వే సంస్థలు చెప్పడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఇది ముందుగానే ఊహించిన వైసీపీ అధిష్టానం కొన్ని సర్వే సంస్థలను ప్రలోభాలకు గురి చేసి చేసి తమకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చేలా మేనేజ్ చేసుకుందని, మొత్తానికి వైసీపీ సినిమా అయిపోయిందని ఎగ్జిట్ పోల్స్ ద్వారా తేలిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.