షేర్ ఆటోలో కిడ్నాప్!
posted on Feb 12, 2016 @ 3:13PM
బహుశా ఇలాంటి కథని మన సినిమావాళ్లు కూడా ఊహించి ఉండరు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన ఒక కిడ్నాప్ ఉదంతం, ప్రమాదం ఎన్ని రకాలుగా పొంచి ఉంటుందో వెల్లడిస్తోంది. గత బుధవారం స్నాప్‌డీల్ సంస్థకు చెందిన దీప్తి శర్మ ఘజియాబాద్ లోని తన కార్యాలయం నుంచి ఇంటికి బయల్దేరారు. ఒక లోకల్ మెట్రో స్టేషన్‌లో దిగిన దీప్తి తన ఇంటికి వెళ్లేందుకు ఎప్పటిలాగే షేర్ ఆటోను ఎక్కారు. ఆ ఆటోలో దీప్తితో పాటు మరో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. ఎంతసేపు గడిచినా ఆటో దీప్తి ఇంటివైపు కాకుండా ఎటెటో తిరగడం మొదలుపెట్టింది. విషయం ఏమిటని అడగబోయిన దీప్తి బ్యాగ్‌ని, మొబైల్ ఫోన్‌ని దుండగులు లాగేసుకున్నారు. ఆ సమయంలో దీప్తి తన స్నేహితురాలితో మాట్లాడుతూ ఉండటంతో, ఆమె అరుపులు కాస్తా స్నేహితురాలికి వినిపించాయి. మరోవైపు దీప్తితో ఉన్న మరో ప్రయాణికురాలిని కత్తి చూపించి దింపేశారు దుండగులు. ఆటోలో డ్రైవరుతో సహా ఉన్న మిగతా ముగ్గురూ దీప్తిని కిడ్నాప్ చేసేందుకు సిద్ధపడిపోయారు. కానీ దీప్తి ప్రమాదంలో ఉందని తెలియడంతో ఆ రాత్రి బందోబస్తుని కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఎక్కడికక్కడ తనిఖీలను నిర్వహించడం మొదలుపెట్టారు. ఘజియాబాద్ పట్టణంలోనే కాకుండా జిల్లాలోని పోలీసు యంత్రాంగం అంతా అలర్ట్ అయిపోయింది. జిల్లాలో ఎంతదూరం ప్రయాణించినా తమ కోసమే ఎదురుచూస్తున్న పోలీసులు కనిపించడంతో కిడ్నాపర్లకు ఏం చేయాలో తోచలేదు. రెండు రోజుల పాటు ఎక్కడికి వెళ్లినా కూడా పోలీసులే కనిపిస్తున్నారు. దాంతో ఇక లాభం లేదనుకుంటూ ఆమెను వదిలిపెట్టేసి పరారయ్యారు. పనిలో పనిగా ఆమె తిరిగి తన ఇంటిని చేరుకునేందుకు టికెట్ కోసం కాసిని డబ్బులు కూడా చేతిలో పెట్టారు. ప్రస్తుతం ఇల్లు చేరుకున్న దీప్తి గురించి మరింత సమాచారం రావలసి ఉంది. అసలు ఆమె చెప్పిన సమాచారం నిజమైనదా కాదా అని కూడా రూఢి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.