ఎమ్మెల్యే కొరికిందట
posted on Mar 13, 2015 @ 3:23PM
కేరళ అసెంబ్లీలో శుక్రవారం నాడు నానా గందరగోళం జరిగిన సంగతి తెలిసిందే. బార్ల లైసెన్సుల స్కాముల్లో భాగస్వామి అయిన మంత్రి కేఎం మణికి అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అర్హత లేదంటూ ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దానికి తోడు అనేకమంది అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు అసెంబ్లీ ముందు గుమిగూడటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తన తోటి మహిళా ఎమ్మెల్యే తనను కొరికారంటూ మరో ఎమ్మెల్యే లబోదిబోమంటూ ఆరోపించారు. వామపక్ష పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే జమీలా ప్రకాశం అసెంబ్లీలో గొడవ సందర్భంగా తనను కొరికారని కాంగ్రెస్ సభ్యుడు కె. శ్రీనివాసన్ ఆరోపించారు. అసెంబ్లీలో గొడవ జరిగిన సమయంలో తాను ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి రక్షణగా నిలబడ్డానని, అప్పుడు జమీలా ప్రకాశం తనను గట్టిగా కొరికారని ఆయన చెప్పారు. జమీలా ప్రకాశం తనను కొరికినప్పుడు చేతికి అయిన గాయాన్ని కూడా ఆయన మీడియాకి చూపించారు.